Vijay Sethupathi | తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న స్టార్ యాక్టర్లలో ఒకడు విజయ్ సేతుపతి (Vijay sethupathi). ఇటీవలే మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో మంచి స్పందన రాబట్టుకుంటోంది. ఇప్పటికే రూ.50 కోట్ల మార్క్‌ను దాటి బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. సినిమా ఎక్కువ మంది ప్రేక్షకులను రీచ్ అయ్యేలా విజయ్ సేతుపతి టీం ప్రమోషన్స్ చేస్తోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో విలన్ రోల్స్ (Villain roles), నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఎలా ఉండాలో చెప్పుకొచ్చాడు మక్కళ్ సెల్వన్. సిల్వర్ స్క్రీన్‌పై విలన్ రోల్స్ చేయాలంటే చేసేందుకు ఇష్టపడని కొన్ని పనులున్నాయా..? అనే ప్రశ్నకు విజయ్ సేతుపతి స్పందిస్తూ.. చాలా విషయాలు ఉంటాయి.. అది కథలు ఎలా చెప్పబడుతున్నాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. జనాలు ఎలాంటి కథనైనా చెప్పొచ్చు. కానీ ఆ కథలో నైతికత ఉండాలి..విలన్ పాత్రైనా సరే కొన్ని విలువలుండాలి. ఆ పాత్ర ఎవరి మనోభావాలను దెబ్బతీయకూడదు.
నటీనటులు, డైరెక్టర్లు భిన్న అభిప్రాయాలు, భావోద్వేగాలు కలిగి ఉంటారు. కానీ ఓ సినిమా చేసేటప్పుడు అందరికీ కోసం తీయాల్సి ఉంటుంది. మనం జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంది. ఉదాహరణకు మూఢ నమ్మకాలకు సపోర్టుగా ఉండకపోతే.. కొన్ని సార్లు ఏది మంచో చెప్పడానికి చెడ్డ విషయాలను చూపించాల్సి వస్తుంది. ఇక్కడ కూడా కొన్ని నైతిక విలువలుంటాయి. ఎందుకంటే సినిమా జనాలను ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉండటమే.