Maharaja Review | కథను నమ్మి సినిమాలు చేసే స్టార్ హీరోల్లో టాప్‌లో ఉంటాడు కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi). కూల్ అండ్ సింఫుల్‌గా కనిపిస్తూనే డిఫరెంట్ రోల్స్‌తో సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేస్తుంటాడు మక్కళ్ సెల్వన్. ఈ స్టార్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వచ్చిన చిత్రం మహారాజ (Maharaja). భారీ అంచనాల మధ్య నేడు తెలుగు, తమిళ రాష్ట్రాల్లో విడుదలైంది. మరి సినిమా అంచనాలు అందుకుందా..? అనేది చూద్దాం..
నటీనటులు :
విజయ్ సేతుపతి, అభిరామి, మమతామోహన్ దాస్, భారతి రాజా, దివ్యభారతి, అనురాగ్ కశ్యప్, మునిష్ కాంత్
డైరెక్టర్ : నితిలన్ సామినాథన్
నిర్మాతలు: సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి
మ్యూజిక్ డైరక్టర్ : అజనీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రాఫర్: దినేష్ పురుషోత్తమన్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
కథ ఏంటంటే..?
సెలూన్ షాపు నిర్వహించే మహారాజ (విజయ్ సేతుపతి) తన కూతురు జ్యోతితో కలిసి నివసిస్తుంటాడు. ముగ్గురు దొంగలు తనపై దాడి చేసిన తన లక్ష్మిని ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు ఇంతకీ లక్ష్మి ఎవరో డైలమాలో పడి కేసు నమోదు చేసేందుకు నో చెప్తారు. కానీ పోలీసులు అదేంటనే అన్వేషణ మాత్రం కొనసాగిస్తుంటారు. ఇంతకీ లక్ష్మి ఎవరు..? మహారాజ అంత జాగ్రత్త ఎందుకు తీసుకుంటాడు..? ఇంతకీ వాళ్లు లక్ష్మి ఎవరో కనిపెడతారా..? లక్ష్మిని మళ్లీ తెచ్చుకోవడమే మహారాజ లక్ష్యమా..? అనే ప్రశ్నల చుట్టూ కథ సాగుతుంది.
బలం :
విజయ్‌సేతుపతి తన 50వ సినిమాను ప్రకటించడం.. యూనిక్ రోల్లో కనిపిస్తుండటంతో సినిమాపై క్యూరియాసిటీ అమాంతం పెరిగిపోయింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే తనకు పర్ఫెక్ట్గా సరిపోయే పాత్రను తీసుకోవడం.
ఫస్ట్ హాఫ్‌లో ఓ వైపు నిజాయితీ గల తండ్రిగా.. మరోవైపు సెకండాఫ్‌లో తాను ఎంతగానో ప్రేమించే లక్ష్మి కోసం వెతికే వ్యక్తిగా విజయ్ సేతుపతి నటన అద్భుతం. సినిమా మొత్తం విశేషమైన స్క్రీన్ ప్రజెంటేషన్‌తో తన మార్క్ చూపించాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కనిపించింది తక్కువ సేపే అయినా అద్భుతమైన యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. అనురాగ్ కశ్యప్ నటనను వన్ ఆఫ్ ది హైలెట్ పాయింట్‌గా చెప్పొచ్చు. భావోద్వేగ సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్యాంగ్, క్మైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులకు థ్రిల్ అందిస్తాయి. ఈ సన్నివేశాల్లో విజయ్ సేతుపతి సహజసిద్దంగా నటించి అదిరిపోయే నటనను ప్రదర్శించాడు.
బలహీనతలు:
చక్కటి స్క్రీన్‌ప్లే ఉన్నప్పటికీ.. కథనం ట్విస్టులతో కథను కొంచెం అయోమయంలో పడేసి.. ఇదే థీమ్‌తో వచ్చిన ఇతర సినిమాలను ప్రేక్షకులను గుర్తు తెచ్చేలా చేయడం. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే డార్క్ కామెడీతో అందరితో కనెక్ట్ అవకపోవడం.
సినిమా ఐదు నిమిషాలు మిస్ అయినా కథ ఇంతకీ వర్తమానంలో ఉందా..? భూతకాలంలోనిదా అని చెప్పడం కష్టం.
టెక్నికల్‌గా..
దినేశ్ పురుషోత్తమన్ సమర్థవంతమైన సినిమాటోగ్రఫీ.. ఫిలోమిన్ రాజ్ పర్ఫెక్ట్ ఎడిటింగ్.. నిర్మాణ విలువలు బాగున్నాయి. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్యాక్ బోన్ అనే చెప్పాలి. తెలుగు డబ్బింగ్, డైలాగ్స్ ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. తన రెండో సినిమా కోసం రైటర్ కమ్ డైరెక్టర్ నిథిలన్ స్వామినాథన్ కఠినమైన కథనాన్ని ఎందుకున్నప్పటికీ ఆకట్టుకునే కథను అందించారు. కొన్ని సన్నివేశాల్లో నెమ్మదిగా సాగే కథ ప్రేక్షకులు ఆసక్తిని కోల్పోయేలా చేస్తుంది.
తీర్పు:
మహారాజ భావోద్వేగాలు, ప్రతీకారం లాంటి అంశాల చుట్టూ నెమ్మదిగా సాగే కథ. విజయ్ సేతుపతి నటనను ఇష్టపడే వారు చూసేయచ్చు. నెమ్మదిగా సాగే కథ, కథనంతో కూడి సినిమాలను ఇష్టపడే వారికి ఈ వారాంతంలో మహారాజ చూడదగ్గ సినిమా అని చెప్పొచ్చు.
రివ్యూ : 2.75/5