Bala Krishna | ఇలయదళపతి విజయ్ త్వరలో సినిమాలకి స్వస్తి చెప్పనున్నారు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన క్రమంలో విజయ్ చివరిగా కేవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై హెచ్. వినోద్ దర్శకత్వంలో ‘జననాయగన్’ పేరుతో చిత్రం చేస్తున్నారు. విజయ్ చివరి చిత్రం కావడంతో దీనిపై అంచనాలు బాగా ఉన్నాయి. ఈ మూవీ బాలయ్య నటించిన భగవంత్ కేసరికి రీమేక్ అనే ప్రచారం జోరుగా నడిచింది. కాని ఈ చిత్రం బాలయ్య మూవీకి రీమేక్ కాదనే టాక్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.. భగవంత్ కేసరి చిత్రంలోని ఒక సీన్‌ని మాత్రమే జననాయగన్లో వాడుకున్నారని సమాచారం. ఆ సీన్ కోసమే ఆ సినిమా మొత్తం రీమేక్ హక్కుల్ని 4.5 కోట్ల రూపాయలకి జననాయగన్ టీం కొనుక్కుందని ప్రచారం జరుగుతుంది.
భగవంత్ కేసరి సినిమాలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే సీన్ చాలా హైలైట్ కాగా, అది మంచి ఎమోషన్ ని పండించింది. కేవలం ఆ సీన్ ని మాత్రమే రీమేక్ చేయడానికి భగవంత్ కేసరి రైట్స్ మొత్తం కొనుక్కున్నారని తెలుస్తుంది.నందమూరి బాలకృష్ణ, శ్రీలీల నటించిన ఆ సీన్ జననాయగన్లో కూడా పెట్టారట. ఈ ఒక్క సీన్ తప్ప భగవంత్ కేసరికి, జననాయగన్‌కి అసలు సంబంధం లేదని రెండు కథలు వేరని అంటున్నారు. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది. వినోద్ దర్శకత్వం వహిస్తున్న జననాయగన్ సినిమా షూటింగ్ జూన్ నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, పూజా హెగ్డే, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నరేన్, ప్రియమణి, మమితా వంటి స్టార్ తారాగణం నటిస్తున్నారు.
జననాయగన్ సినిమా 2026 జనవరి 9న విడుదలవుతుందని ప్రకటించారు. ఈ సినిమాలో విజయ్ ‘దళపతి విజయ్ కొండాన్’ పాత్రలో నటించనున్నారని అంటున్నారు. జననాయగన్ సినిమాటోగ్రఫీని సత్యన్ సూర్యన్, స్టంట్స్‌ని అనిల్ అరసు, ఆర్ట్ డైరెక్షన్‌ని వి. సెల్వకుమార్ చూసుకుంటున్నారు. విజయ్ చివరి సినిమాగా చెబుతున్న నేపథ్యంలో ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఇక విజయ్ ఇప్పటికే తమిళనాడులో రాజకీయ పార్టీని స్థాపించి రాబోయే ఎన్నికల్లో తన సత్తా చాటాలని యోచిస్తున్నారు. పార్టీకి మంచి ఆదరణ లభిస్తే సినిమాలు చేయడం కష్టమే.