Vijay | తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో అధికార పార్టీ డీఎంకేతో పాటు బీజేపీ కూటమి, అలాగే నటుడు విజయ్ స్థాపించిన పార్టీ కూడా బలంగా పోటీకి సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో విజయ్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విజయ్ తన పార్టీ నుంచి విరుగంబక్కం నియోజకవర్గానికి శబరినాథన్ అనే యువకుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. శబరినాథన్ ఎవరనే విషయంపై ఆసక్తి పెరగడంతో అతని నేపథ్యం వెలుగులోకి వచ్చింది.
శబరినాథన్ తండ్రి రాజేంద్రన్ గతంలో విజయ్ వద్ద డ్రైవర్‌గా పనిచేసి, తర్వాత వ్యక్తిగత సహాయకుడిగా (పీఏ) బాధ్యతలు నిర్వహించారు. సాధారణ కుటుంబానికి చెందిన శబరినాథన్ ఉన్నత విద్యలో భాగంగా ఎంటెక్ పూర్తి చేసి ఖతార్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో విజయ్ రాజకీయాల్లోకి రావడంతో ఆయన ప్రభావితుడయ్యాడు.పార్టీలో చేరాతానని తన తండ్రిని అడిగినా మొదట అంగీకారం లభించలేదు. అయితే తర్వాత విజయ్‌తో నేరుగా మాట్లాడిన శబరినాథన్కు ఆయన ప్రోత్సాహం లభించడంతో, రాజేంద్రన్‌ను కూడా ఒప్పించి 2024లో పార్టీ కార్యకలాపాల్లోకి తీసుకొచ్చారు. పార్టీలో చురుకుగా పనిచేస్తూ వచ్చిన శబరినాథన్కు మొదట జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించారు.
ఇప్పుడు అదే శబరినాథన్కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ద్వారా విజయ్ సామాన్య కుటుంబాలకు అవకాశాలు కల్పిస్తున్నారనే సందేశం వెళ్లిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం శబరినాథన్ తన నియోజకవర్గంలో ప్రచారంలో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా చురుకుగా వ్యవహరిస్తూ ప్రజలకు దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్‌తో చిన్నప్పుడు దిగిన ఫొటోని పంచుకోగా అది వైరల్‌గా మారింది. ఈ పరిణామం నేపథ్యంలో విజయ్ నిర్ణయాన్ని కొందరు ప్రశంసిస్తుండగా, మరికొందరు రాజకీయ ప్రయోజనాల కోణంలో విశ్లేషిస్తున్నారు. అయితే సాధారణ వ్యక్తిని రాజకీయ రంగంలోకి తీసుకురావడం ద్వారా విజయ్ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.