అగ్ర హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న 12వ చిత్రానికి ‘కింగ్డమ్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. మే 30న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకానుంది. బుధవారం టైటిల్‌తో పాటు టీజర్‌ను కూడా విడుదల చేశారు. తెలుగు వెర్షన్‌కు ఎన్టీఆర్ వాయిస్ఓవర్ అందించారు.
‘అలసటలేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం, వలసపోయినా..అలసిపోయినా ఆగిపోనిది ఈ మహారణం, ఈ అలజడి ఎవరి కోసం? ఇంత బీభత్సం ఎవరి కోసం?…రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం, కాలచక్రాన్ని బద్దలుకొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం’ అంటూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో టీజర్ ఆద్యంతం ఎమోషనల్‌గా సాగింది.
విజయ్ దేవరకొండ సరికొత్త మేకోవర్‌తో గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కనిపించారు. టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది. పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జోమోన్ టి జాన్, గిరీష్ గంగాధరన్, ఆర్ట్: అవినాష్ కొల్లా, సంగీతం: అనిరుధ్ రవిచందర్, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య,
రచన-దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి.