ఇటీవల జరిగిన ‘రెట్రో’ ప్రీరిలీజ్ ఈవెంట్లో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు అగ్ర నటుడు విజయ్ దేవరకొండ. పహల్గాం దాడిని ఖండిస్తూ ఆయన మాట్లాడిన మాటల్లో ‘ట్రైబ్’ అనే పదం వాడటం వివాదానికి దారితీసింది. తన మాటల వెనకున్న ఉద్దేశ్యాన్ని కొందరు అపార్థం చేసుకున్నారని, ఏ వర్గాన్నీ ,తెగనూ కించపరచడం తన అభిమతం కాదని విజయ్ దేవరకొండ తెలిపారు. ‘చారిత్రక, నిఘంటువు అర్థంలోనే నేను ఆ పదాన్ని ఉపయోగించాను.
నాగరికత తొలినాళ్లలో మనమందరం తెగలుగా, విభిన్న జాతులుగా ఉన్నామనే అర్థంలో నేను ‘ట్రైబ్స్’ అనే పదాన్ని వాడాను. అంతేకానీ ఇప్పుడున్న షెడ్యూల్ ట్రైబ్స్ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు. నేను షెడ్యూల్ ట్రైబ్స్ వారిని ఎంతగానో గౌరవిస్తాను. ప్రేమిస్తాను. మన సమాజ పురోభివృద్ధిలో వారు ముఖ్య భాగమని భావిస్తాను.
దేశ ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు సాగాలి. ఐక్యంగా ఉండాలని మాట్లాడాను. నేను ఏ సమూహంపైన ఉద్దేశ్యపూర్వకంగా వివక్ష చూపలేదు. వారందరూ నా కుటుంబ సభ్యులు, సోదరులు. నా మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నా. శాంతి, పురోభివృద్ధి, ఐక్యత కోసం నా సినిమా మీడియాను ఉపయోగిస్తాను’ విజయ్ అన్నారు.