Vijay Devarakonda | ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. స్టార్ హీరో రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అతి కొద్ది మంది నటులలో విజయ్ దేవరకొండ ఒకడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీప్రయాణం మొదలు పెట్టి పాన్ ఇండియా స్టార్‌గా ఎదగడం అంటే మాములు విషయం కాదు. ఇది కేవలం అదృష్టం అనుకుంటే పొరపాటే. విజయ్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్ట పడ్డాడు. కష్టానికి అదృష్టం తోడైందంతే. ఆ అదృష్టం పేరు ‘అర్జున్ రెడ్డి’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి.. విజయ్‌కు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో అర్జున్ పాత్రకు విజయ్ తప్ప మరొకరు న్యాయం చేయలేరేమో అనే విధంగా తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు.
ఈ సినిమా తర్వాత వచ్చిన ‘గీతా గోవిందం’ కూడా అనూహ్య విజయం సాధించింది. అంతంత మాత్రపు అంచనాలతో రిలీజైన ఈ సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్లో చేరి స్టార్ హీరోలను సైతం ఆశ్చర్యంలో పడేసింది. ఈ సినిమాతో విజయ్‌కు ఫ్యామిలీ ఆడియోన్స్ సపోర్ట్ కూడా వచ్చింది. ఇలా రెండు బ్యాక్ టు బ్యాక్ విజయాల తర్వాత వచ్చిన ‘నోటా’ డిజాస్టర్‌గా మిగిలింది. రెండు విజయాల తర్వాత ఒక ఫ్లాప్ సాధరణమే అనుకుంటున్న టైమ్‌లో ‘టాక్సీవాల’తో భారీ కంబ్యాక్ ఇచ్చాడు. సినిమా మొత్తం ఆల్రెడీ ఇంటర్నెట్లో లీకైనా.. కేవలం విజయ్ క్రేజ్ వల్లే సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా మళ్లీ రెండు ఫ్లాపులు.
ఈ క్రమంలోనే పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకోవాని రెండేళ్లు గ్యాప్ తీసుకుని ‘లైగర్’తో గతేడాది ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమా మొదటి రోజు నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. విజయ్ లాంటి ప్రామిసింగ్ నటుడికి ఈ సినిమాలో నటించే స్కోపే లేదు. పైగా నత్తి కూడా తోడవడంతో ఈ సినిమాను ప్రేక్షకులు ఆధరించలేక పోయారు. రిలీజ్‌కు ముందు ఏర్పడిన బజ్ వల్ల ఓపెనింగ్స్ భారీగానే వచ్చాయి. కానీ సెకండ్ డే నుంచి కలెక్షన్లు తగ్గాయి. దాంతో వారం తిరగకుండానే దుకాణం సర్దేసింది. ఈ సినిమా ఫలితంతో పూరి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా మొదలు పెట్టిన ‘జనగణమన’కు ఫుల్ స్టాప్ పడింది.
ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ ‘ఖుషీ’ పైనే ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే సమంత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. గతేడాది ప్రథమార్థంలోనే షూటింగ్ మొదలుకాగా ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ మాత్రమే పూర్తి చేసుకుంది. ఇప్పటికే రిలీజవ్వాల్సిన సినిమా ఇంకా షూటింగ్ కూడా పూర్తి చేసుకోలేదు. దాంతో విజయ్ కాస్త అయోమయంలో పడ్డాడు. ఎప్పుడు షూటింగ్ ప్రారంభమైవుతుందో ఇంకా క్లారిటీ లేదు. ఈ సినిమా పూర్తయితే తప్ప కొత్త సినిమాకు వెళ్లే పరిస్థితిలేదు.
ఆ మధ్య గౌతమ్ తిన్ననూరితో సినిమా అంటూ వార్తలు వచ్చిన.. అది ‘ఖుషీ’ రిజల్ట్‌పైనే ఆధారపడి ఉందని తెలుస్తుంది. ఇక సుకుమార్‌తో సినిమా కన్ఫార్మ్ అన్నట్లే ఆ మధ్య చెప్పిన.. ఇప్పట్లో అది పట్టాలెక్కే చాన్స్ లేదు. దాంతో ఇప్పుడు విజయ్‌కు ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఎప్పుడెప్పుడు ఖుషీ షూటింగ్ పూర్తవుతుందా అంటూ విజయ్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాడు. సమంత ఆరోగ్యం కుదుటపడితే వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.