Vijay Devarakonda | సినీ నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల డెంగ్యూతో బాధపడి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. తాజా సమాచారం మేరకు ఆయన పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు తెలుస్తుంది. ఆయనకు వైద్యం అందించిన ప్రైవేట్ ఆసుపత్రి వర్గాల నివేదిక ప్రకారం, విజయ్ త్వరితగతిన కోలుకుంటున్నారని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ టీమ్‌కు చెందిన సభ్యుడు ఒకరు ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ, ప్రారంభంలో ఆయనకు జ్వరం మాత్రమే ఉండడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు. కానీ పరీక్షలలో డెంగ్యూ వచ్చిందని నిర్ధారణ కావడంతో హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ మూడు రోజుల పాటు చికిత్స తీసుకుని తాజాగా డిశ్చార్జ్ అయ్యారు అని వివరించారు.
విజయ్ దేవరకొండ ఆసుపత్రిలో చేరాడని వార్త బయటకు రావడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఇప్పుడు ఆయన కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడని తెలిసి కుదుటపడ్డారు. ఇక విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘కింగ్డమ్’ జూలై 31న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రమోషనల్ వీడియోలు ముందుగానే చిత్రీకరించగా, అవి త్వరలో విడుదల కానున్నాయి. కోలుకున్న వెంటనే విజయ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొననున్నారని సమాచారం. ఈ నెల 26న ‘కింగ్డమ్’ ట్రైలర్ విడుదల కానుండగా, జూలై 28న ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. విజయ్ దేవరకొండ ఆ ఈవెంట్‌కు హాజరవుతారని చిత్రబృందం వెల్లడించింది.
ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా, ఫార్చూన్ 4 సినిమాస్ మరియు సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నాగవంశీ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ మూవీపై ఆసక్తిని పెంచుతున్నారు. కింగ్డమ్ చిత్ర విడుదల ఇప్పటికే అనేక వాయిదాలు ఎదుర్కొంది. మొదట మే 30కి, ఆ తర్వాత జులై 4కి, చివరికి జూలై 31కి వాయిదా పడింది.మరి ఈ చిత్రంతో అయిన విజయ్ దేవరకొండకి మంచి విజయం దక్కుతుందా లేదా అనేది చూడాలి. అయితే విజయ్ అభిమానులు అతని ఆరోగ్యం విషయంలో వచ్చిన అప్డేట్ తో ఊపిరి పీల్చుకోగా, ఇప్పుడు అతని సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.