‘ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకునే యువకుడి కథ ఇది. తన తల్లి లక్ష్యాన్ని నెరవేర్చే క్రమంలో సమస్యల్లో చిక్కుకుంటాడు. వాటి నుంచి అతను ఎలా బయటపడ్డాడన్నదే చిత్ర కథ’ అన్నారు ఆనందకృష్ణన్. ఆయన దర్శకత్వంలో విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘విజయ్ రాఘవన్’. ఆత్మిక కథానాయిక. ‘కోడియిల్ ఒరువన్’ పేరుతో తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని రవిచంద్రారెడ్డి, శివారెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 17న విడుదలకానుంది. ఆదివారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. విజయ్ ఆంటోని మాట్లాడుతూ “బిచ్చగాడు’ ఓ అమ్మకథ అయితే, ఈ సినిమా ఓ అమ్మ కలను నెరవేర్చే తనయుడి కథ. చక్కటి కుటుంబ అనుబంధాలతో సాగుతుంది. భాషాశ్రీ మంచి సంభాషణలందించారు. తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘అద్భుతమైన కథ ఇది. థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాం’ అని చెప్పారు. కథానుగుణంగా చక్కటి బాణీలు కుదిరాయని సంగీత దర్శకుడు నివాస్ కె ప్రసన్న తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్.ఎస్.ఉదయ్‌కుమార్, నిర్మాతలు: టి.డి.రాజా, డి.ఆర్. సంజయ్‌కుమార్, రచన-దర్శకత్వం: ఆనందకృష్ణన్.