Vignesh Shivan |కోలీవుడ్‌లో స్టార్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విఘ్నేష్ శివన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.విషయంలోకి వెళితే విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటించిన ‘నానుమ్ రౌడీ థాన్’ సినిమా 2015 అక్టోబర్ 21న విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం విడుదలై పది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా విఘ్నేష్ శివన్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో స్పెషల్ పోస్ట్ పంచుకున్నారు.“‘నానుమ్ రౌడీ థాన్’ సినిమా విడుదలై 10 సంవత్సరాలు అవుతుంది. అనేక అద్భుతాలతో ఆశీర్వదించబడిన జీవితం ఈ అందమైన రోజు(అక్టోబర్ 21)నే ప్రారంభమైంది. కాలం ఎంత అందంగా తన సంగీతాన్ని ప్లే చేసిందంటే.. నేను ఈరోజు గురించి ఎన్నో కలలు కన్నాను” అంటూ విఘ్నేష్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
అలాగే తన భార్య నయనతార మరియు కవల పిల్లలు ఉయిరే, ఉలగంతో కలిసి దిగిన కుటుంబ ఫొటోలను కూడా షేర్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2012లో ‘పోడా పోడి’ సినిమాతో దర్శకత్వ రంగంలోకి అడుగుపెట్టిన విఘ్నేష్ శివన్, ఆ చిత్రం ఫ్లాప్ కావడంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరమయ్యారు. మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత 2015లో ధనుష్ నిర్మించిన ‘నానుమ్ రౌడీ థాన్’తో తిరిగి రీఎంట్రీ ఇచ్చి, బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు. ఈ సినిమా ఆయన కెరీర్‌కు మలుపు తిప్పడమే కాకుండా, నయనతారతో ప్రేమకథకు సాక్ష్యమైంది. ఈ సందర్భంగా విఘ్నేష్ శివన్ తన కొత్త చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ గురించీ ప్రస్తావించారు.
“డిసెంబర్ 18న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మీ అందరి హృదయాలను చేరుతుంది. మీ ప్రేమ, మీ చిరునవ్వు ఈ రోజును నాకు మరింత ప్రత్యేకంగా మారుస్తున్నాయి. ఈ క్షణం కోసం నా ఆనందాన్ని దాచుకున్నాను, ఈరోజు నాకు చాలా అందంగా కనిపిస్తోంది” అని ఆయన రాసుకొచ్చారు. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ పోస్ట్ చేసిన ఈ ఎమోషనల్ నోట్, కుటుంబ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అభిమానులు “విఘ్నేష్–నయనతార జంట నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.