హిందీ సినీరంగంలో పురుషాధిపత్యంపై గత కొన్నేళ్లుగా నిరసన గళాన్ని వినిపిస్తున్నది బాలీవుడ్ సీనియర్ కథానాయిక విద్యాబాలన్. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా విజయాల్ని కూడా దర్శకులే తమ ఖాతాలో వేసుకుంటున్నారని, నాయికల్ని పూర్తిగా విస్మరిస్తున్నారని ఆమె తాజా ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో అలియాభట్ టైటిల్ రోల్ షోషించిన ‘గంగూబాయి కతియావాడి’ సినిమా గురించి ప్రస్తావించింది.
ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించినా..కథానాయిక అలియాభట్‌కు ఏమాత్రం క్రెడిట్ దక్కలేదని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘హీరోలతో సమానంగా హీరోయిన్లు కష్టపడుతుంటారు. మహిళా ప్రధాన చిత్రాల్లో సినిమా భారాన్ని మొత్తం వారే మోస్తారు. అయినా వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదు. సినిమా సక్సెస్ కాగానే దర్శకులు అది తమ ఘనతేనని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ధోరణిలో మార్పు రావాలి. ‘గంగూబాయి కతియావాడి’ విషయంలో అలియాభట్ కష్టాన్ని తగ్గించే ప్రయత్నం జరిగింది’ అని విద్యాబాలన్ పేర్కొంది.