తొలి తెలుగు నేపథ్యగాయని, దాదాపు ఏడు దశాబ్దాల పాటు తన సుమధుర గాత్రంతో తెలుగు సంగీతప్రియుల్ని అలరించిన రావు బాలసరస్వతీ దేవి (97) బుధవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. లలిత సంగీత సామ్రాజ్ఞిగా, సంగీత సరస్వతిగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచారామె. నేపథ్యగానంతో పాటు అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు రెండువేల పాటలతో భారతీయ సంగీత ప్రపంచంపై చెరగని ముద్రవేశారు.
బాలసరస్వతీ దేవి 1928 ఆగస్ట్ 29న మద్రాస్‌లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు విశాలాక్షి, కావేటి పార్థసారధి. తండ్రి మంచిగాయకులుగా పేరు తెచ్చుకున్నారు. చెన్నైలో కొంతకాలం ఉన్న తర్వాత వారి కుటుంబం గుంటూరుకి మకాం మార్చింది. అక్కడే బాలసరస్వతి కర్ణాటక సంగీతాన్ని అభ్యసించారు. ఆ తర్వాత ఆమె తండ్రి ముంబయి తీసుకెళ్లి వసంత్ దేశాయ్ వద్ద హిందుస్తానీ సంగీతాన్ని నేర్పించారు. చిన్న వయసులోనే సరస్వతిదేవి సంగీతంలో అద్భుత ప్రావీణ్యం సంపాదించారు. గుంటూరులో ఆమె కుటుంబానికి రత్నమహల్ అనే థియేటర్ ఉండేది.
దానిని వారు నాటకరంగ స్థలంగా మార్చారు. అక్కడ ప్రదర్శించే నాటకాలకు బాలసరస్వతి నేపథ్య గానం అందించేవారు. అలా ఆమె పాటలు పాడుతున్నప్పుడు హెచ్.ఎం.వి గ్రాంఫోన్ రికార్డు కంపెనీ వారు విని, ఆమెకు తెలియకుండానే వాయిస్ రికార్డు చేసి తీసుకెళ్లారు. తొలిసారి ఆమె ‘పరమ పురుషా పరంధామా’ ‘దొరికె దొరికె నీ దర్శనము’ అనే రెండు సోలో సాంగ్స్ పాడారు. వాటికి మంచి పేరు రావడంతో దర్శకులు సి.పుల్లయ్య ‘సతీ అనసూయ’ (1936)చిత్రంలో అవకాశమిచ్చారు. ఈ చిత్రంలో గంగ అనే బాల నటి పాత్రలో పాడుతూ నటించారు. ‘ఏది దారి నాకిచట ఈ కలుష భూతములపాలైతిని..’ అన్నది సరస్వతీదేవి పాడిన తొలిపాట.
చిన్నతనంలోనే పాటలు పాడటం మొదలుపెట్టడంతో ఆమెను అందరూ బేబీ సరస్వతి అని పిలిచేవారు. ఆ తర్వాత బాలసరస్వతి అనే పేరు స్థిరపడిపోయింది. బాలసరస్వతి 12 సినిమాల్లో బాలనటిగా కనిపించారు. తమిళ చిత్రం ‘భక్త కుచేల’లో బాలకృష్ణుడిగా, ‘బాలయోగిని’ అనే తమిళ చిత్రంలో టైటిల్ రోల్‌ని పోషించారు. ‘బాలయోగిని’ చిత్రంతోనే ఆమె పేరు ముందు బాల అని చేర్చి బాలసరస్వతీదేవిగా మార్చారు. అనంతర కాలంలో ఆమె నటిగా, గాయనికి తిరుగులేని పేరు సంపాదించారు. స్వప్నసుందరి, పిచ్చిపుల్లయ్య, పెళ్లిసందడి, శాంతి, షావుకారు, దేవదాసు, లైలా మజ్ను, భాగ్యలక్ష్మి, మంచి మనసుకు మంచి రోజులు వంటి చిత్రాల్లో ఆమె పాడిన పాటలు ప్రజాదరణ పొందాయి. సుదీర్ఘ కెరీర్లో ఆమె ఘంటసాల, ఏ.ఎం.రాజా, సౌందర్‌రాజన్, పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కి, ఏ.పి.కోమల వంటి వారితో కలిసి ఎక్కువగా పాటలు పాడారు.
జమీందారు రాజారావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావును ఆమె 1944లో వివాహమాడారు. అప్పటి జమీందారి కుటుంబ కట్టుబాట్ల వల్ల సినిమాల్లో పాటలు పాడటం, నటించడం తగ్గించారు. అలా ఎన్నో సినిమాల్లో గాయనిగా అవకాశాలను వదులుకున్నారు. 1974లో భర్త మరణానంతరం సరస్వతీదేవి తిరిగి పాటలు పాడటం మొదలుపెట్టారు. మద్రాస్, విజయవాడ ఆకాశవాణి కేంద్రాల్లో లలిత సంగీత కార్యక్రమాలు ఆమెతోనే ప్రారంభమయ్యాయి. సంగీత దర్శకులు ఎస్.రాజేశ్వరరావుతో కలిసి 1940-50 మధ్య ఎన్నో లలిత గీతాలను ఆలపించారు. ప్రసిద్ధ గీత రచయిత సి.నారాయణ రెడ్డి తెలుగులోకి అనువదించిన ‘మీరాభజన్’ గీతాలను ఆలపించారు. స్వీయ సంగీత దర్శకత్వంలో ‘రాధా మాధవం’ అనే లలిత గీతాల సంకలనాన్ని విడుదల చేశారు. బాలసరస్వతీదేవి మృతిపట్ల అగ్ర హీరోలు పవన్‌కల్యాణ్, బాలకృష్ణతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. బాలసరస్వతీదేవి అంత్యక్రియలు బుధవారం సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానంలో ముగిశాయి.