Asha Sharma | భారతీయ చిత్ర పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ప్రముఖ నటి ఆశా శర్మ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధికారిక ‘ఎక్స్’ వేదికగా తెలిపింది. 88 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారని తెలిపింది. పరిశ్రమ మరో స్టార్‌ను కోల్పోయిందని పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె కుటుంబానికి సంతాపం ప్రకటించింది. అయితే, ఆమె మృతి కారణాలు తెలియరాలేదు. టీవీ ఇండస్ట్రీలో ఆమె ఎంతో పేరు సంపాదించారు. చాలా సంవత్సరాలుగా సినిమాలు, టీవీ షోల్లో చేస్తూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
తల్లి, అమ్మమ్మ పాత్రలు ఆమెను ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ధర్మేంద్ర, హేమమాలిని మూవీ ‘దో దిశాయీన్’ మూవీలోనూ అద్భుత నటనను కనబరిచి ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రంలో ఆశాతో పాటు ప్రేమ్ చోప్రా, అరుణా ఇరానీ, నిరుపా రాయ్‌తో పాటు పలువురు నటించారు. వెండితెరపై ‘ముఝే కుచ్ కెహనా హై, ‘ప్యార్ తో హోనా హి థా’, ‘హమ్ తుమ్హారే హై సనమ్’ సీరియల్స్‌లో నటించారు. ఆమె చివరిసారిగా ప్రభాస్, కృతిసనన్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రంలోనూ నటించారు. బుల్లితెరపై ‘కుంకుమ్ భాగ్య’, ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ’, ‘ఏక్ ఔర్ మహాభారత్’ తదితర సీరియల్స్‌లోనూ నటించారు.