Super Star Krishna | తెలుగు లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానుల సందర్శనార్థం ఇవాళ సాయంత్రం కృష్ణ భౌతికకాయాన్ని గచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నారు. అనంతరం అక్కడి నుంచి రేపు ఉదయం పద్మాలయ స్టూడియోస్‌కు తరలిస్తారు. కొన్ని ఆచార కార్యక్రమాలు పూర్తయ్యాక.. మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేయనున్నట్లు కృష్ణ సోదరుడు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు తెలిపారు.
సూపర్ స్టార్ కృష్ణ (80) మృతి చెందిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్టుతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. కృష్ణ మరణ వార్త ఆయన కుటుంబ సభ్యులు, తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టింది.