వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘రావు బహదూర్’. వెంకటేశ్ మహా దర్శకుడు. చింతా గోపాలకృష్ణరెడ్డి, అనురాగ్‌రెడ్డి, శరత్చంద్ర నిర్మాతలు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, నమ్రత శిరోద్కర్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది. ఈ నేపథ్యంలో మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేశారు. ‘పసిడివన్నె పూలతీగలా.. అల్లుకుంది నన్నిలా.. తరానికే తరుణీమణీ.. తరించెనే నయనాలనీ..’ అంటూ సాగే ఈ పాటను రెహ్మాన్ రాయగా, స్మరణ్‌సాయి స్వరపరిచారు. విజయ్ యేసుదాస్ ఆలపించారు. కథానాయిక అందాన్ని వర్ణిస్తూ మెలోడీ ప్రధానంగా ఈ పాట సాగింది.
దర్శకుడు వెంకటేశ్ మహా మాట్లాడుతూ ‘నిర్మాతల సహకారం వల్లే ఈ సినిమాను సులభంగా పూర్తి చేయగలిగాను. నటీనటులంతా అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు పనిచేసిన టెక్నికల్ టీమ్‌కి పేరుపేరున ధన్యవాదాలు. ‘కేరాఫ్ కంచర్లపాలెం’ సినిమాకు మించిన అనుభూతిని మీకివ్వాలని ఈ సినిమా తీశాను’ అన్నారు. నిర్మాతలు ఇంత ఆనందంగా ఉన్నారంటే, దర్శకుడు మహా ఎంత అద్భుతంగా సినిమా తీశాడో అర్థం చేసుకోవచ్చని, బాహుబలి, అవతార్ సినిమాల స్థాయిలో మమ్మల్ని అలరించే సినిమా ‘రావు బహదూర్’ అని హీరో సత్యదేవ్ నమ్మకంగా చెప్పారు.