Venkatramaiah Gari Taaluka | ప్రముఖ దర్శకుడు సతీష్ ఆవాల దర్శకత్వంలో, కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించిన సరికొత్త చిత్రం “వెంకట్రామయ్య గారి తాలూకా” అన్ని రకాల నిర్మాణానంతర కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుని, రాబోయే జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం ద్వారా దినేష్ కుమార్ కథానాయకుడిగా పరిచయమవుతుండగా, ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్గా తెలుగు చిత్రసీమకు పరిచయమవ్వడం విశేషం. సీనియర్ నటులు మురళీధర్ గౌడ్, సుధ ఈ సినిమాలో అత్యంత కీలకమైన టైటిల్ పాత్రలలో కనిపించనున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, ప్రముఖ ఫోక్ సింగర్ కోమలి మాట్లాడుతూ, గాయనిగా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత, సినిమా రంగంపై ఉన్న మక్కువతో, ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొని ఒక మంచి ధ్యేయంతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. సినిమా ప్రారంభం నుండి ఇప్పటివరకు ఎన్నో కష్టాలను, నిద్రలేని రాత్రులను దాటుకుంటూ ఎట్టకేలకు సినిమాను జూలైలో విడుదలకు సిద్ధం చేశామని, ఈ ప్రయాణంలో మీడియా మద్దతు తమకు ఎంతో అవసరమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు దర్శకుడు సతీష్ ఆవాల మాట్లాడుతూ, ఒక అందమైన పల్లెటూరి నేపథ్యంలో, వెంకట్రామయ్య అనే పరువుగల కుటుంబంలో జరిగే కథ ఇదని వివరించారు. ప్రస్తుత సమాజంలో మనుషుల మధ్య బంధాలు కేవలం డబ్బుతోనే ముడిపడిపోతున్నాయని, మానవీయ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్న తీరును ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నామని అన్నారు. ఎంతో కష్టపడి నలుగురు పిల్లలను అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను, వారి చివరి దశలో ఆ నలుగురు పిల్లలు కలిసి కూడా చూసుకోలేకపోతున్నారనే చేదు నిజాన్ని, తల్లిదండ్రుల గొప్పతనాన్ని చాటిచెప్పే విధంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు. ఇదొక అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా అని, ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో కలిసి థియేటర్లలో హాయిగా ఆస్వాదించేలా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే అధికారిక ప్రెస్ మీట్ ద్వారా విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది.
ఈ చిత్రంలో కాశీవిశ్వనాథ్, మిర్చి మాధవి, సత్యశ్రీ, ఇక్బాల్, జీవనప్రియ, గౌరీనాయుడు, హరీష్ టెక్కలి, యూట్యూబర్ సంతూముంజెటి, హాసిని, యామిని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సాంకేతికంగానూ అగ్రశ్రేణి నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు, చరణ్ అర్జున్ సంగీతాన్ని అందించగా, బి. అనిల్ కుమార్ కెమెరా బాధ్యతలను, ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. సాగర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి కడలి రాంబాబు పి.ఆర్.ఓగా వ్యవహరిస్తున్నారు.