Venkatesh | విక్టరీ వెంకటేష్ సినిమాలకి మినిమం గ్యారెంటీ ఉంటుంది. అయితే ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకటేష్ ఆ తర్వాత సినిమా కోసం దాదాపు ఆరు నెలలు గ్యాప్ తీసుకున్నారు. ఆయన కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే వెంకటేష్ సినిమాలకి సంబంధించి నెట్టింట అనేక ప్రచారాలు జరుగుతున్నా దేనిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే యుఎస్ లో జరుగుతున్న నాట్స్ 2025 వేడుకలో తన నుంచి రాబోయే చిత్రాల గురించి స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు వెంకటేష్. వాటిలో అందరూ ఎదురు చూస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ చిత్రంతో పాటు చిరంజీవి చిత్రం కూడా ఉంది.
వెంకీ మామ మాట్లాడుతూ.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఓ సినిమా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. ఇది తొలి అధికారిక స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ప్రాజెక్ట్‌లో తాను ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. గతకొంతకాలంగా వస్తున్న వార్తలపై ఇప్పుడు పూర్తి క్లారిటీ ఇచ్చారు. సూపర్ హిట్ సిరీస్ అయిన ‘దృశ్యం’కి మూడో భాగం కూడా ఉంటుందని వెంకటేష్ వెల్లడించారు. అందులో మీనాతో కలిసి నటించబోతున్నట్టు తెలియజేశారు. మరోవైపు, నందమూరి బాలకృష్ణ సినిమాలోనూ ఓ స్పెషల్ కేమియో చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో వెంకటేష్ 2025లో సినిమాల పరంగా బిజీగా ఉండబోతున్నట్టు స్పష్టమైంది.
వెంకటేష్ – త్రివిక్రమ్ సినిమా ఎప్పుడో అనౌన్స్ చేసినా, ఇప్పటివరకు పూర్తి స్క్రిప్ట్ రెడీ కాలేదని తెలుస్తోంది. అందుకే వెంకీ మామ అప్పటి వరకూ మిగతా ప్రాజెక్టులపై ఫోకస్ పెడుతున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల వెంకటేష్ చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ₹300 కోట్ల క్లబ్లో చేరడం ద్వారా, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ (₹250 కోట్లు) రికార్డును మించిపోయింది. దీంతో టాలీవుడ్ సీనియర్ హీరోలలో వెంకటేష్ ఇప్పుడు టాప్ పొజీషన్లో నిలిచారు. మొత్తానికి వెంకటేష్ ఫ్యూచర్ ప్రాజెక్టులపై పాజిటివ్ బజ్ నడుస్తోంది. అనీల్- చిరంజీవి చిత్రం పొంగల్ కానుకగా రానుండగా, ఈ చిత్రంతో మళ్లీ సంక్రాంతికి తెరపై కనిపించి సందడి చేయనున్నారు వెంకటేష్.