ఓదెల గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, సంపత్‌నంది రాసిన కథతో రూపొంది.. ఓటీటీ ప్రేక్షకుల్ని అలరించిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రం ‘ఓదెల 2’. తమన్నా భాటియా ఇందులో నాగ సాధువుగా లీడ్‌రోల్ చేస్తున్నది. సంపత్‌నంది కథతో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి డి.మధు నిర్మాత. నటుడు వశిష్ట ఎన్ సింహ ఇందులో తిరుపతిగా మెయిన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో వశిష్ట ముఖం సగం పుర్రెగా, సగం మనిషిగా పాక్షికంగా మాత్రమే కనిపిస్తున్నది. ఈ భయంకరమైన లుక్ అతని నైజాన్ని తెలియజేస్తున్నదని మేకర్స్ తెలిపారు. ఈ భక్తిరస యాక్షన్ థ్రిల్లర్‌లో వశిష్ట ఒక భయంకరమైన రాక్షస పాత్రలో కనిపించబోతున్నారని, ఓదెల గ్రామానికి అతను ఓ పీడకల అని మేకర్స్ చెప్పారు. హెబ్బా పటేల్, యువ, నాగమహేశ్, వంశీ, గగన్ విహారి, సురేందర్‌రెడ్డి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌రాజన్ ఎస్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, నిర్మాణం: మధు క్రియేషన్స్, సంపత్‌నంది టీమ్‌వర్క్స్.