మెగా హీరో వరుణ్‌తేజ్ నటిస్తున్న కామెడీ హారర్ థ్రిల్లర్ ‘కొరియన్ కనకరాజు’. రితికా నాయక్ కథానాయిక. మేర్లపాక గాంధీ దర్శకుడు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని ‘రాసా గుమ్మాడి’ పాటను ఆదివారం ఏపీలోని అనంతపురంలో అభిమానుల సమక్షంలో మేకర్స్ విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను తమన్ స్వరపరచగా, నల్గొండ గద్దర్ ఆలపించారు. మాస్ ప్రేక్షకులు మెచ్చేలా ఈ పాట సాహిత్యం, సంగీతం సాగింది. ఈ పాటలో దక్ష నగార్కర్ గ్లామరస్ ప్రెజెన్స్, ఆమెతో వరుణ్‌తేజ్ కెమిస్ట్రీ యువతను ఆకట్టుకునేలా ఉన్నది.
ఈవెంట్లో వరుణ్‌తేజ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా చిత్రీకరణ అనంతపూర్‌లోనే జరిగింది. ఇక్కడే ఈ పాటను విడుదల చేయడం ఆనందంగా ఉంది. పెదనాన్న చిరంజీవిగారిని దృష్టిలో పెట్టుకొని ఈ పాటకు డ్యాన్స్ చేశాను. ఇక్కడ కూడా డ్యాన్స్ చేయాలనుంది. కానీ కాలికి గాయం అయ్యింది. అందర్నీ ఎంటర్టైన్ చేసేలా సినిమా ఉంటుంది. మీ ఆశీర్వాదం మాకు కావాలి’ అన్నారు. మాస్‌కి నచ్చే ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉంటాయని దర్శకుడు మేర్లపాక గాంధీ చెప్పారు. ఇంకా నిర్మాత రాజీవ్‌రెడ్డి, అనంతపూర్ ఉడా చైర్మన్ వరుణ్ కూడా మాట్లాడారు.