Constable | కొత్త బంగారు లోకం, హ్యాపిడేస్, కుర్రాడు సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశాడు నటుడు వరుణ్ సందేశ్. అయితే ఈ సినిమాలు ఇచ్చిన బ్రేక్‌తో స్టార్ నటుడుగా మారుతాడు అనుకున్న సమయంలో వరుస ఫ్లాప్‌లు అతడిని కిందకి దించేశాయి. ప్రస్తుతం ఆడపదడపా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. గతేడాది నింద సినిమాతో వచ్చి మంచి మార్కులు సంపాదించాడు. ఇదిలావుంటే ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కానిస్టేబుల్. ఈ సినిమాకు ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వం వహిస్తుండగా.. జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి కానిస్టేబుల్ ప్రమోషనల్ సాంగ్‌ను హైదరాబాద్ కమిషనర్ సీవి ఆనంద్ చేతుల మీదుగా చిత్రబృందం లాంఛ్ చేయించింది. కానిస్టేబుల్ అన్నా అనే టైటిల్‌తో వచ్చిన ఈ పాట కానిస్టేబుళ్ల కృషి, అంకితభావం, త్యాగాలకు గుర్తుకుతెస్తుందని చిత్రబృందం వెల్లడించింది. ఈ సాంగ్ విన్న హైదరాబాద్ కమిషనర్ సినిమా విజయం సాధించాలని చిత్రబృందానికి విషెస్ తెలిపాడు. సుభాష్ ఆనంద్ సంగీతం అందించిన ఈ పాటను నల్గొండ గద్దర్ నర్సన్న పాడారు.