సిటడెల్: హనీ-బన్నీ
అమెజాన్ ప్రైమ్: నవంబర్ 7
తారాగణం: సమంత, వరుణ్ ధావన్, కేకే మీనన్, సికందర్ ఖేర్, షకీబ్ సలీమ్ తదితరులు
దర్శకత్వం: రాజ్ అండ్ డీకే
టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా.. ‘స్పై’ చిత్రాలకు ఉండే క్రేజేవేరు. అబ్బురపరిచే చేజింగులు.. ఫైరింగులతో సగటు ప్రేక్షకుడు ఫీలయ్యే కిక్కేవేరు. ఊహించని ట్విస్టులు, అదిరిపోయే టర్నింగులు.. సినిమా చూస్తున్నంతసేపూ మనల్ని మునివేళ్లపై నిలబెడతాయి. అందుకే, ‘గూఢచారి’ చిత్రాలెప్పుడూ.. బాక్సాఫీస్‌ను కొల్లగొడుతూనే ఉన్నాయి. ఆ ఫార్ములాతో వచ్చే వెబ్‌సిరీస్ కూడా ‘హిట్’ టాక్ తెచ్చుకున్నాయి. స్టార్ దర్శక ద్వయం రాజ్-డీకే కూడా ఇదేబాటలో నడుస్తున్నారు. ఇప్పటికే ఫ్యామిలీమ్యాన్, ఫర్జీ, గన్స్ అండ్ గులాబ్స్తో సక్సెస్ సాధించారు. ఇప్పుడు ‘సిటడెల్ : హనీ-బన్నీ’నీ అమెజాన్ ప్రైమ్ వేదికగా రంగంలోకి దింపారు.
కథలోకి వెళ్తే.. నైనిటాల్‌లోని ఓ కెఫేలో పని చేస్తుంటుంది హనీ (సమంత). ఆమెకు నాడియా (కశ్వీ మజ్ముందార్) అనే ఐదేళ్ల కూతురు ఉంటుంది. ఒకరోజు తమను ఎవరో వెంబడిస్తున్నట్టు గుర్తిస్తుంది హనీ. వారినుంచి తప్పించుకునే క్రమంలో దొరికిపోతుంది. చివరికి వారి చెరనుంచి బయటపడి.. కుమార్తెతో సహా వేరే ఊరికి వెళ్లిపోతుంది. కానీ, కొందరు వ్యక్తులు హనీ ఉన్న ప్రదేశం తెలుసుకుని.. అక్కడికీ వస్తారు. మరోవైపు, విదేశాల్లో ఉంటున్న బన్నీ (వరుణ్ ధావన్)కి.. చనిపోయిందనుకున్న తన భార్య హనీ బతికే ఉందన్న విషయం తెలుస్తుంది. దాంతో ఆమెను వెతుక్కుంటూ భారత్‌కు వస్తాడు. అయితే.. హనీ-బన్నీ గతం ఏంటి? హనీ వెంటపడుతున్న వ్యక్తులు ఎవరు? ఎంతటి వారితోనైనా పోరాడే సామర్థ్యం హనీకి ఎలా వచ్చింది? భార్యను వెతుక్కుంటూ వచ్చిన బన్నీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ప్రైవేటు సీక్రెట్ ఏజెన్సీ నాయకుడు గురు (కేకే మేనన్) ఒకవైపు, ‘సిటడెల్’ టీమ్ మరోవైపు వెతుకుతున్న ‘అర్మార్డ్’ ఏమిటి? అది ఎవరి చేతికి చిక్కింది? ఈ విషయాలు తెలుసుకోవాలంటే.. ‘సిటడెల్ : హనీ – బన్నీ’ చూడాల్సిందే! ఆరు ఎపిసోడ్ల ఈ సిరిస్ ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది.