Ram Gopal Varma | టాలీవుడ్ చరిత్రలో సెన్సేషన్ సృష్టించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తొలి చిత్రం ‘శివ’ మళ్లీ వెండితెరపై మెరవడానికి సిద్ధమైంది. 1989 అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చింది. అక్కినేని నాగార్జున, అమల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అంచనాలు లేకుండా విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది. ఆ సమయంలో నాగార్జున పూర్తిస్థాయి స్టార్‌గా ఎదుగుతుండగా, వర్మకు ఇది తొలి సినిమా. అయినప్పటికీ, మౌత్‌టాక్‌తో ఈ సినిమా భారీ బ్లాక్‌బస్టర్‌గా మారి నిర్మాత అక్కినేని వెంకట్‌ని ఆశ్చర్యపరిచింది. మొదటి రోజు ఉదయం షోకు తక్కువ ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ, రెండో షో నుండి ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు. సాయంత్రానికి హౌస్‌ఫుల్ బోర్డులు వేలాడుతూ, అదనపు థియేటర్ల కోసం బయ్యర్లు డిమాండ్ చేశారు.
‘శివ’ సినిమా కేవలం వసూళ్లు మాత్రమే కాదు, తెలుగు సినిమాకు కొత్త దిశ చూపింది. ఇళయరాజా సంగీతం, ఆర్జీవీ రియలిస్టిక్ టేకింగ్, ఆకట్టుకునే కథనం అన్నీ కలసి కొత్త తరహా సినిమాకు నాంది పలికాయి. ఆ తర్వాత 1990లో హిందీలోనూ ‘శివ’ రీమేక్ చేసి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం నాగార్జునకు స్టార్ ఇమేజ్, వర్మకు డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు, సినిమా విడుదలై 36 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, ఈ కల్ట్ క్లాసిక్‌ను 4K క్వాలిటీతో నవంబర్ 14న రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా నాగార్జున, రామ్ గోపాల్ వర్మ షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికర సంఘటనలను పంచుకున్నారు.
‘శివ’ సినిమాలో హీరోకి సమానంగా నిలిచిన పాత్ర గణేష్. ఆ పాత్రలో నటించిన విశ్వనాథ్ అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. అయితే ఆ పాత్రను మొదటగా మోహన్ బాబుకు ఆఫర్ చేశారని, కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం నో చెప్పారట. మోహన్ బాబు ఆ పాత్ర చేస్తే ప్రేక్షకులు పాత్రను కాకుండా నటుడినే చూస్తారు. కొత్త ముఖం ఉంటే రౌడీగా నిజంగా నమ్ముతారు అని వర్మ చెప్పడంతో విశ్వనాథ్‌ను ఎంచుకున్నారట. ఆ నిర్ణయమే సినిమాకు బలం చేకూర్చింది. ఇప్పుడు, 36 ఏళ్ల తర్వాత ‘శివ’ మళ్లీ పెద్ద తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. పవర్ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీన్స్, ఆ కొత్తదనాన్ని మరోసారి థియేటర్లో అనుభవించేందుకు అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.