Varanasi | సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చిత్రీకరణ ప్రారంభమైన నాటి నుంచి ఎలాంటి విరామం లేకుండా రాజమౌళి టీమ్ పనులను ముందుకు తీసుకెళ్తోంది. ముందుగా ప్రకటించిన సమయానికే సినిమాను విడుదల చేయాలన్న లక్ష్యంతో పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ కొనసాగుతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, మహేష్ బాబు తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి పూర్తి చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా ఎస్.ఎస్. రాజమౌళి సినిమాలు షూటింగ్ పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. కానీ ‘వారణాసి’ విషయంలో మాత్రం ఆయన పూర్తి భిన్నంగా ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు మహేష్ బాబుపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా, మరోవైపు ఇతర పాత్రల షూటింగ్ కూడా సమాంతరంగా కొనసాగుతోంది. రాజమౌళి కీలక సన్నివేశాల వద్ద ఉండగా, మిగతా యూనిట్ ఇతర భాగాలను పూర్తి చేస్తోంది. హీరో పార్ట్ పూర్తయిన వెంటనే సినిమా మెజారిటీ షూటింగ్ పూర్తి అయినట్టే అవుతుంది. తర్వాతి దశలో టెక్నికల్ పనులపై పూర్తి ఫోకస్ పెట్టేలా టీమ్ ప్లాన్ చేస్తోంది. రాజమౌళి ప్రతి చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్, టెక్నికల్ వర్క్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. ‘వారణాసి’లో కూడా అదే తరహాలో అధునాతన సాంకేతిక ప్రమాణాలతో సినిమా రూపొందుతోంది. షూటింగ్ జరుగుతూనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా పూర్తి చేసేలా వ్యూహం అమలు చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సుమారు 120 దేశాల్లో ఒకేసారి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలాంటి గ్లోబల్ రిలీజ్ కోసం అంతర్జాతీయ పంపిణీ సంస్థలు, ఏజెన్సీలతో ముందుగానే చర్చలు జరపాల్సి ఉంటుంది. అయితే ఎస్.ఎస్. రాజమౌళికు ఉన్న అంతర్జాతీయ గుర్తింపు, ముఖ్యంగా ఆస్కార్ విజయంతో వచ్చిన క్రేజ్ కారణంగా ఈ ప్రక్రియ సులభమవుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. మహేష్ బాబు – ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే పాన్ వరల్డ్ స్థాయిలో హైప్ క్రియేట్ చేసింది.