Varanasi |మెక్సికో సిటీ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక పాప్ కల్చర్ ఈవెంట్ ‘CCXP MX 2026’కి టాలీవుడ్ నుంచి వచ్చిన భారీ ప్రాజెక్ట్ వారణాసి అద్భుత స్పందనను సొంతం చేసుకుంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి – సూపర్ స్టార్ మహేశ్ బాబు కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి గ్లింప్స్‌ను అక్కడ విడుదల చేయగా, హాలీవుడ్ ప్రేక్షకులు సైతం విజువల్స్‌కు ఫిదా అయిపోయారు. ఈ గ్లింప్స్‌లో కనిపించిన విజువల్ గ్రాండియర్, యాక్షన్ ఎలిమెంట్స్, పురాణాల టచ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వారణాసి నేపథ్యంతో రూపొందించిన సన్నివేశాలు అంతర్జాతీయ స్థాయి మేకింగ్‌ను ప్రతిబింబించాయి.
విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ఈ గ్లింప్స్ వైరల్‌గా మారి, ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా రాజమౌళి పంపిన ప్రత్యేక వీడియో సందేశం కూడా విశేష చర్చకు దారి తీసింది. భారతీయ పురాణాల మూలాలను ఆధారంగా తీసుకుని, గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ చిత్రాన్ని మలుస్తున్నామని ఆయన వెల్లడించారు. తన కెరీర్లో ఇదొక అత్యంత అంబిషస్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు.ముఖ్యంగా మహేశ్ బాబు పాత్రపై ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో హైప్‌ను పెంచేశాయి. ఇప్పటివరకు మీరు చూడని కొత్త మహేశ్‌ను చూస్తారుఅంటూ రాజమౌళి ఇచ్చిన హామీ అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. గ్లింప్స్‌లో మహేశ్ బాబు రఫ్ అండ్ టఫ్ లుక్, పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపించి కొత్త అవతారంలో మెప్పించారు.
ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఎం.ఎం. కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌కే హాలీవుడ్ రేంజ్ ఫీల్ తీసుకొచ్చిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మైనస్ డిగ్రీల చలిలో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు సాంకేతికంగా ఉన్నత స్థాయిని చాటుతున్నాయి. ‘RRR’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్ కావడంతో హాలీవుడ్ ప్రముఖ స్టూడియోలు సైతం ఈ చిత్రంపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నాయి. మెక్సికోలో వచ్చిన అద్భుత స్పందన చూస్తుంటే, ‘వారణాసి’ గ్లోబల్ మార్కెట్లో భారీ విజయాన్ని నమోదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.భారీ గ్రాఫిక్స్, ఉత్కంఠభరితమైన కథ, ప్రపంచ స్థాయి యాక్షన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం విడుదలైన గ్లింప్స్ టాక్ మాత్రం ఇంటర్నెట్ను ఊపేస్తూ, సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తుతోంది.
#VIDEO | El director S. S. Rajamouli envió un video con un mensaje especial para sus fans CCXP México 2026, donde se presentó un primer adelanto de “Varanasi”… #GENTE
🎥 Jacqueline Ponce León pic.twitter.com/kvVPGWKLrX— REFORMA (@Reforma) April 25, 2026