యువతరంలో మంచి ఫాలోయింగ్ ఉన్న కథానాయికల్లో వాణీ కపూర్ ఒకరు. రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ద్వారా బాలీవుడ్లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ భామ ‘మండాల మర్డర్స్’ వెబ్‌సిరీస్ ద్వారా ఓటీటీ వేదికపై అరంగేట్రం చేస్తున్నది. గోపీ పుత్రన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా తన తొలి ఓటీటీ అనుభవాలను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది వాణీ కపూర్. ఆమె మాట్లాడుతూ ‘క్రైమ్ థ్రిల్లర్స్‌లో ఇదొక సరికొత్త ప్రయోగం. ఓటీటీ ఎంట్రీ కోసం అసాధారణమైన కథ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఈ సిరీస్ నన్ను వెతుక్కుంటూ వచ్చింది.
విజయానికి దగ్గరి దారులు లేవనే సిద్ధాంతాన్ని నేను బాగా నమ్ముతాను. అందుకే ఈ సినిమాలో పాత్ర కోసం చాలా పరిశోధన చేశాను. నన్ను నేను కొత్త పంథాలో ఆవిష్కరించుకోవడానికి మంచి అవకాశంగా భావించా. ఈ సిరీస్ నన్ను నటిగా ఓ మెట్టు ఎక్కిస్తుందని భావిస్తున్నా’ అని పేర్కొంది. యష్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించింది.