పోసాని కృష్ణమురళి దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘వాడెవ్వడు వీడెవ్వడు మన ప్రేమకు అడ్డెవ్వడు’. స్నేహ, శ్వేత, శృతి, అశోక్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాస్టర్ బాలు, మాస్టర్ మహేష్ సమర్పణలో బీఎం క్రియేషన్స్పై పప్పుల కనకదుర్గారావు నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో చిత్ర వివరాలు తెలిపారు. పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ…‘నిర్మాత కనకదుర్గారావుతో నాకొక మంచి అనుబంధం ఏర్పడింది. నాతో ఏడాదికి రెండు సినిమాలు నిర్మిస్తానని చెప్పాడు. మా అబ్బాయి ఉజ్వల్ పోసాని రచన చేసిన ఈ చిత్రానికి నేను దర్శకత్వం వహించాను. దాదాపు అందరూ కొత్త నటీనటులే నటించారు. విజయవాడ నేపథ్యంతో సినిమా సాగుతుంది. 30 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. సినిమాను త్వరలో విడుదలకు తీసుకొస్తాం’ అన్నారు. ‘ఇప్పటివరకు మన సినిమాల్లో రాని కాన్సెప్ట్ ఇది. పోసాని దర్శకత్వ శైలి ఆకట్టుకుంటుంది. ఆగస్టులో చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం’ అని నిర్మాత పప్పుల కనకదుర్గారావు అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – సుధాకర్ అక్కెనపల్లి, ఎడిటింగ్ – బాలరాజు భుక్య.