చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న వడ్డే నవీన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. వడ్డే క్రియేషన్స్ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించి మొదటి చిత్రంగా ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వడ్డే నవీన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కమల్‌తేజ నార్ల దర్శకత్వం వహిస్తున్నారు. రాశీసింగ్ కథానాయిక. శనివారం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.
‘ఆద్యంతం వినోదప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఎనభైశాతం చిత్రీకరణ పూర్తయింది. వినూత్న కథాంశంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. రఘుబాబు, సాయిశ్రీనివాస్, బాబా మాస్టర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ సుజాత సాయికుమార్, సంగీతం: కల్యాణ్‌నాయక్, నిర్మాత: వడ్డే నవీన్, దర్శకత్వం: కమల్‌తేజ నార్ల.