వాళై
డిస్నీ+ హాట్ స్టార్: అక్టోబర్ 11
తారాగణం: నిఖిలా విమల్, పొన్వెల్ ఎం,
కలైయరసన్, రఘుల్ తదితరులు
దర్శకత్వం: మారి సెల్వరాజ్
చరిత్రను ఒక్కసారి రివైండ్ చేస్తే.. విషాధ సంఘటనలెన్నో రీల్స్‌లా కండ్లముందు కదలాడుతాయి. భీతిగొలిపే యుద్ధాలు.. ప్రకృతి విపత్తులు.. ఘోర ప్రమాదాలు.. ఇలా యదార్థ గాథలెన్నో సినిమాలుగా తెరకెక్కాయి. ఆయా చిత్రాల్లోని బాధితుల వ్యథలు.. ప్రేక్షకుల గుండెలను తడుముతాయి. కళ్లను తడిచేస్తాయి. డిస్నీ+హాట్‌స్టార్‌లో రికార్డ్ స్ట్రీమింగ్ నమోదు చేస్తున్న ‘వాళై’ కూడా అలాంటి చిత్రమే! తమిళనాడులోని ఓ మారుమూల గ్రామంలో 12 ఏండ్ల శివనంద (పొన్వెల్ ఎం) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తల్లి, పెళ్లీడుకొచ్చిన అక్క.. ఇదే అతని కుటుంబం. అరటి తోటల్లో పనిచేయడమే ఆ నిరుపేద కుటుంబంతోపాటు ఊరి ప్రజల జీవనాధారం.
ఉదయాన్నే లారీ రావడం, అందరూ సద్దులు కట్టేసుకుని అందులో వెళ్లడం.. అరటి గెలలు దించి లోడ్ ఎత్తడం.. ఆ లారీపైనే కూర్చుని రాత్రికి ఇంటికి చేరుకోవడం.. ఇదే వారి దైనందిన జీవితం. కాంట్రాక్టర్ దగ్గర తీసుకున్న అప్పు తీరాలంటే శివనంద కూడా పనిచేయాల్సిందే! తనకు ఇష్టం లేకున్నా.. అరటి గెలలు దింపాల్సిందే! శివకు మాత్రం స్కూల్‌కి వెళ్లడం, చదువుకోవడం ఇష్టం. క్లాస్‌లో ఎప్పుడూ ఫస్ట్ ఉండే శివ అంటే.. ఆ స్కూల్ టీచర్లలందరికీ ఎంతో మురిపెం. అతనికి మాత్రం పూన్గుడి టీచర్ (నిఖిలా విమల్) అంటే ఎంతో అభిమానం. పేదరికంలో మగ్గుతూ.. సెలవు రోజుల్లో పనికి వెళ్తూ, బాగా చదువుకుంటున్న శివ అంటే.. ఆ టీచర్‌కి కూడా ఎంతో మమకారం. ఒకరోజున శివ తల్లికి జబ్బు చేయడంతో.. ఆమెకు బదులుగా అరటి గెలలు దింపడానికి శివ వెళ్లాల్సి వస్తుంది. అదే రోజున స్కూల్లో తన డ్యాన్స్ ప్రోగ్రామ్ రిహార్సల్స్ ఉండటంతో.. శివ పని ఎగ్గొట్టి స్కూల్‌కి వెళ్తాడు. మధ్యాహ్నం భోజనం లేక ఆకలితో అలమటిస్తాడు.
ఇంటికొచ్చి చాటుగా అన్నం తినబోతుంటే.. వాళ్ల అమ్మ చూసి, పని ఎగ్గొట్టాడని చితకబాదుతుంది. ఖాళీ కడుపుతోనే ఊరి బయటికి వెళ్లిపోయి.. వాగులో నీళ్లుతాగి.. అలసటతో అక్కడే నిద్రలోకి జారుకుంటాడు. తెల్లారి లేచి ఊళ్లోకి వచ్చేసరికి.. ఊరివాళ్లంతా ఏడుస్తుంటారు. ప్రతి ఇంటిముందూ ఓ శవం కనిపిస్తుంది. అసలు.. ఆ రాత్రి ఏం జరిగింది? ముందురోజు పనికి వెళ్లినవాళ్లంతా శవాలుగా ఎందుకు మారాల్సి వచ్చింది? అనేది తెలుసుకోవాలంటే.. సినిమా చూడాల్సిందే! 1990లలో తమిళనాడులో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. రూపాయి కోసం గ్రామీణ కూలీలు పడే అవస్థలు.. అరటిపండ్ల వ్యాపారుల దోపిడీ.. పేదరికంతో చదువుకు దూరం అవుతున్న పిల్లలు.. ఈ అంశాలన్నిటినీ కండ్లకు కడుతుంది. గాఢమైన భావోద్వేగాలను పంచుతుంది.