Pahalgam Attack | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వెళ్లిన పర్యటకులపై మంగళవారం మధ్యాహ్నం ఉగ్రవాదులు దాడి జరుపగా.. ఈ నరమేధంలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో కశ్మీర్లోయతోపాటు దేశంమొత్తం భగ్గుమంది. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదిలావుంటే ఈ ఘటన అనంతరం పాకిస్థాన్‌కి చెందిన నటులపై మళ్లీ వ్యతిరేకత మొదలైంది. పుల్వామా దాడి ఘటన అనంతరం పాకిస్థాన్‌కి చెందిన నటులు ఇండియన్ సినిమాలలో నటించడం మానేసిన విషయం తెలిసిందే. అయితే చాలా రోజుల తర్వాత పాకిస్థాన్‌కి చెందిన నటుడు ఫవాద్ ఖాన్ మళ్లీ ఒక బాలీవుడ్ సినిమాలో నటించబోతున్నాడు.
బాలీవుడ్ నటి వాణీకపూర్ (Vaani Kapoor), పాకిస్థాన్ స్టార్ ఫవాద్ ఖాన్(Fawad Khan) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘అబీర్ గులాల్’(Abeer Gulal). ఆర్తి ఎస్. బాగ్డి(Aarti S. Bagdi) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుంది. ఈ చిత్రం మే 09న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. వాణీ కపూర్ ఫవాద్ ఖాన్‌తో ఉన్న ‘అబీర్ గులాల్’ పోస్టర్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తాను పోస్ట్ చేసిన రోజే ఉగ్రదాడి (Pahalgam Terror Attack) జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఉగ్రదాడి ఘటనపై స్పందించకుండా పాకిస్థాన్ నటుడితో సినిమాను చేయడమే కాకుండా ప్రమోషన్స్ చేస్తుందంటూ వాణీ కపూర్‌పై విమర్శలు వెల్లవెత్తాయి. అయితే ఈ వివాదం ఇంకా ముదురుతుండడంతో తాజాగా ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది వాణీ. మరోవైపు ఉగ్రదాడి ఘటనపై పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. దాడిని ఖండించాడు. అలాగే మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.