Ustaad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ మూవీ ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విడుదలైన మొదటి రోజునుంచే ఈ సినిమా మంచి స్పందనను అందుకుంటూ, ముఖ్యంగా వీకెండ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ కలెక్షన్లను రాబడుతోంది. సినిమాలో మాస్ ఎలిమెంట్స్, పవన్ కళ్యాణ్ స్టైల్ యాక్షన్, ఎంటర్టైనింగ్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచిన విషయం తెలిసిందే. ఈ ధరల పెంపు సాధారణ ప్రేక్షకులపై, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌పై ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటంతో కొంతమంది ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి వెనుకంజ వేస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ టికెట్ ధరలతోనే సినిమా ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా మరింత మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకర్షించాలని మేకర్స్ భావిస్తున్నారు. టికెట్ ధరలు తగ్గించడం వల్ల సినిమాకు లాంగ్ రన్లో మరింత కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇక ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. థమర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. సినిమాకి తొలి రోజే మిక్స్ డ్ టాక్ లభించింది. అయితే టికెట్ ధరలు తగ్గించే ఈ నిర్ణయం ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు ఎంతవరకు ప్లస్ అవుతుందో రాబోయే రోజుల్లో స్పష్టమవనుంది.