Ustaad bhagat singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి టాలీవుడ్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తుంటారు. అయితే రాజకీయాల వలన పవన్ కళ్యాణ్ సినిమాలు కాస్త తగ్గించాడు. దాదాపు రెండేళ్ల క్రితం మేనల్లుడు సాయి దుర్గా తేజ్ తో కలిసి ‘బ్రో అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జూలై 28, 2023లో ఈ విడుదల అయ్యింది. ఆ తరువాత మళ్ళీ స్క్రీన్ మీద కనిపించలేదు పవన్. అయితే ‘హరి హర వీరమల్లు’తో ఈ నెల 12న థియేటర్లలోకి రానున్నారు. మరోవైపు తాను కమిట్ అయిన ఓజీ చిత్ర షూటింగ్ కూడా శరవేగంగా జరిగేలా ప్లాన్స్ చేసుకున్నారు పవన్ .
ఇప్పటికే ఓజీ చిత్ర రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. సెప్టెంబర్ 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని ఇటీవలే పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఇక పవన్ కమిటైన మరో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా గమనిస్తూ వస్తున్నారు. ఎట్టకేలకి దీనిపై హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ దర్శకుడు హరీశ్ శంకర్ మంగళవారం ఉదయం విఐపి విరామం సమయంలో దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదశీర్వచనం అందించగా… ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
ఆలయం వెలుపల మీడియాతో హరీశ్ శంకర్ మాట్లాడుతూ… జూన్ రెండవ వారంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలియజేశారు. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు స్వామివారి ఆశీస్సులు కోసం తిరుమలకు వచ్చామని హరీష్ తెలియజేయడంతో పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ అప్డేట్ ఉంటుందని నిర్మాత రవిశంకర్ ఇటీవల వివరణ ఇచ్చిన విషయం విదితమే.