Ustaad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్‌బస్టర్ కావడంతో, ఇప్పుడు ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్, రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నా, ఈ సినిమా షూటింగ్‌కి తగినంత సమయం కేటాయిస్తున్నారు. అంకితభావంతో సినిమాపై పూర్తి దృష్టిపెడుతూ షూటింగ్‌ను వేగవంతం చేస్తున్నారు. ఇటీవల చిత్ర బృందం అత్యంత కీలకమైన క్లైమాక్స్ సీన్ షూటింగ్‌ను పూర్తిచేసింది. దర్శకుడు హరీష్ శంకర్, ఈ సన్నివేశాన్ని భావోద్వేగాలు, యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించినట్టు సమాచారం.
ఈ పవర్‌పుల్ సీక్వెన్స్‌ని ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ నబకాంత మాస్టర్ కంపోజ్ చేశారు. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ నటనతో ఈ సన్నివేశం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయనుందని చిత్ర బృందం భావిస్తోంది. చిత్రీకరణ అనంతరం పవన్ కళ్యాణ్, యాక్షన్ బృందానికి ఫోటోలు షేర్ చేస్తూ.. క్లైమాక్స్ సీన్ గొప్పగా రూపుదిద్దినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సీక్వెన్స్ అద్భుతంగా రావడం పట్ల పవన్ కళ్యాణ్ సైతం హర్షం వ్యక్తం చేశారు. షూటింగ్ పూర్తి అయిన తర్వాత నబకాంత టీమ్ లోని అందరికీ ఆయన ఫోటోగ్రాఫ్స్ ఇచ్చారని చిత్రబృందం స్పష్టం చేసింది.. ‘గబ్బర్ సింగ్’ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఇక ఈ చిత్రంలో శ్రీలీల , రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను పార్థిబన్, కె. ఎస్. రవికుమార్, రాంకీ, నవాబ్ షా, ‘కేజీఎఫ్’ ఫేమ్ అవినాష్, నాగ మహేష్, ‘టెంపర్’ వంశీ తదితరులు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని మరియు వై. రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మాస్, యాక్షన్ ప్రియుల్ని ఆకట్టుకునే విధంగా సినిమా రూపుదిద్దుకుంటోందని నిర్మాతలు హామీ ఇస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్టైల్, హరీష్ శంకర్ డైరెక్షన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరోసారి మిరాకల్ చేయబోతుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.