శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. రిషికేశ్వర్ యోగి దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డా॥ సింధు రెడ్డి నిర్మాతలు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు హీరో సుధీర్‌బాబు, దర్శకుడు వీరశంకర్, వీజే సన్నీ, శ్రీరామ్ ఆదిత్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మంచి కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కోరారు. మానవ సంబంధాల లోతుల్ని తరచి చూపించే ఈ కథ ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని దర్శకుడు రిషికేశ్వర్ యోగి తెలిపారు. జాతీయ అవార్డు అందుకునే కంటెంట్ ఉన్న సినిమా ఇదని, యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథతో ఆకట్టుకుంటుందని ప్రధాన పాత్రధారులు శివకుమార్, నితిన్ ప్రసన్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.