న్యూఢిల్లీ: బ్రిటన్‌లో ఎమర్జెన్సీ(Emergency) చిత్రం స్క్రీనింగ్‌ను కొందరు సిక్కులు అడ్డుకున్నారు. ఆ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద ఆందోళన నిర్వహించారు. దీంతో ఆ ఫిల్మ్ స్క్రీనింగ్‌ను రద్దు చేశారు. దీన్ని బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్మాన్ ఖండించారు. భావ స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదు అని ఆ కన్జర్వేటివ్ నేత యూకే పార్లమెంట్లో మాట్లాడారు. దానికి చెందిన వీడియోను కంగనా తన ట్విట్టర్లో పోస్టు చేసింది. తన చిత్రానికి బ్రిటన్ ఎంపీ మద్దతు పలికారని, కానీ భారతీయ రాజకీయవేత్తలు, ఫెమినిస్టులు మౌనంగా ఉన్నట్లు ఆమె ఆరోపించారు.
ఎమర్జెన్సీ చిత్ర ప్రదర్శనను అడ్డుకున్న అంశంపై భారతీయ విదేశాంగ శాఖ.. బ్రిటన్‌తో చర్చించింది. విదేశాంగ శాఖ తమ అభ్యర్థనలను వెల్లడించింది. హారో వూ సినిమా హాల్లో ఎమర్జెన్సీ ఫిల్మ్ స్క్రీనింగ్‌ను కొందరు ప్రో ఖలిస్తానీయులు అడ్డుకున్నారు. సుమారు 40 నిమిషాల సినిమా ముగిసిన తర్వాత.. మాస్క్‌లు ధరించిన ఖలిస్తానీ మద్దతుదారులు ఆ ఫిల్మ్ ప్రదర్శన నిలిపివేశారు. చిత్రాన్ని తిలకిస్తున్న ప్రేక్షకుల్ని బెదిరించి బయటకు పంపించారు. దీన్ని ఎంపీ బాబ్ బ్లాక్మాన్ తప్పుపట్టారు. ఫిల్మ్ స్క్రీనింగ్‌ను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టవచ్చు కానీ, ప్రాథమిక హక్కు అయిన భావ స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదన్నారు.
బ్రిటన్‌లోని పలు సినిమా హాళ్లలో ఎమర్జెన్సీ చిత్ర ప్రదర్శనను నిలిపివేసిన అంశాన్ని పరిశీలించామని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌దీర్ జైస్వాల్ తెలిపారు. భావ స్వేచ్ఛ, భావ ప్రకటనను వేరుగా చూడరాదన్నారు. చిత్ర ప్రదర్శనను అడ్డుకున్న వారిపై బ్రిటన్ సర్కారు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ చిత్రాన్ని సిక్కుల వ్యతిరేక చిత్రంగా భావిస్తున్నామని సిక్కు ప్రెస్ అసోసియేషన్ ఓ ప్రటకనలో పేర్కొన్నది.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితకథ ఆధారంగా ఎమర్జెన్సీ చిత్రాన్ని తీశారు. నటి కంగనా రనౌత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ ఫిల్మ్‌లో ఇందిర పాత్రను కూడా కంగనే పోషించారు. ప్రధానిగా ఇందిర తీసుకున్న అనేక కీలక నిర్ణయాలను చిత్రంలో చూపించారు. కంగనా రనౌత్ తన నటనా ప్రతిభను అత్యద్భుతంగా ప్రదర్శించారు. ఇందిర పాత్రలో ఆమె ఇమిడిపోయారు. 1971 ఇండో పాక్ వార్, దేశంలో ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి, ఆ సమయంలో విపక్ష జనతా పార్టీ ఆవిర్భావం, బ్లూ స్టార్ ఆపరేషన్‌తో పాటు ఇందిర కుమారుడు సంజయ్ గాంధీ సన్నివేశాలు చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయి. కంగన యాక్షన్ సీన్స్.. హాలీవుడ్‌కు తీసిపోని టేకింగ్.. డైలాగ్స్.. చాలా సరళమైన నరేషన్తో .. ఫిల్మ్‌ను ఆసక్తికరంగా రూపొందించారు.
British MP raises his voice for my fundamental right of free speech meanwhile pin drop silence from Indian politicians and feminists #Emergency https://t.co/rlYbUckJm0
— Kangana Ranaut (@KanganaTeam) January 24, 2025