Salman Khan | బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నివాసం గెలాక్సీ అపార్ట్మెంట్లలోకి అక్రమంగా ప్రవేశించేందుకు వరుసగా జరుగుతున్న ప్రయత్నాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మే 20న జితేంద్ర కుమార్ సింగ్ అనే యువకుడు చొరబడేందుకు ప్రయత్నించి అరెస్ట్ కాగా, ఆ మరుసటి రోజే (మే 21న) తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఇషా ఛబ్రా (36) అనే మహిళ కూడా అదే భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి లిఫ్ట్ వరకు చేరుకుంది. పోలీసులు ఆమెను కూడా అరెస్టు చేసి, ఇద్దరిపై అక్రమ ప్రవేశం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, మే 20న ఉదయం 9:45 గంటల సమయంలో జితేంద్ర కుమార్ సింగ్ సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. అక్కడి భద్రతా సిబ్బంది అతడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించగా, జితేంద్ర కోపంతో తన ఫోన్‌ను నేలకేసి విసిరేశాడు.
అదే రోజు సాయంత్రం 7:15 గంటల ప్రాంతంలో జితేంద్ర మళ్ళీ సల్మాన్ ఖాన్ ఇంటి వద్దకు వచ్చాడు. ఈసారి, గెలాక్సీ అపార్ట్మెంట్లో నివసిస్తున్న మరో వ్యక్తి కారు వెనుక దాక్కుని లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకుని వెంటనే బాంద్రా పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు జితేంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా, తాను సల్మాన్ ఖాన్ అభిమానినని, ఆయనను వ్యక్తిగతంగా కలవాలనుకుంటున్నానని చెప్పాడు. భద్రతా సిబ్బంది అనుమతించకపోవడంతో కారు వెనుక దాగి లోపలికి వెళ్లాలని ప్రయత్నించినట్లు తెలిపాడు. అతడి వద్ద ఎటువంటి ఆయుధాలు లేవని పోలీసులు నిర్ధారించారు. మరోవైపు మే 21న ఇషా ఛబ్రా (36) అనే మహిళ గెలాక్సీ అపార్ట్మెంట్లో ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇటీవల సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 14న ఆయన ఇంటి వద్ద కాల్పుల ఘటన జరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సల్మాన్‌కు ‘వై ప్లస్’ స్థాయి భద్రతను కల్పించింది. ఈ నేపథ్యంలో, ఈ అక్రమ ప్రవేశ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.