Tuk Tuk | ఓటీటీలో ఇప్పుడు చిన్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. కంటెంట్ ఉంటే చాలు క్యాస్ట్ ఏదైనా చూసేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లోకి వచ్చిన టుక్ టుక్ సినిమా కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఈ సినిమా ట్రెండింగ్‌లో టాప్ 3 పొజిషన్‌ను సంపాదించుకుంది. అంతేకాకుండా ఇప్పటివరకు ఈ సినిమాకు 100 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ టుక్ టుక్ సినిమాలో తెలుగమ్మాయి శాన్వీ మేఘన, కోర్టు ఫేం హర్ష్ రోషన్, సలార్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ దేవ్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ ఏడాది మార్చిలో థియేటర్లో విడుదలైన చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఓటీటీలోకి అక్కడ కూడా ట్రెండింగ్‌లో నిలిచింది.
కథేంటంటే..
ఒక ఊళ్లో ముగ్గురు టీనేజీ స్నేహితులు డబ్బుల కోసం వినాయక చవితికి గణేశుడి విగ్రహం పెడతారు. కానీ ఊళ్లో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ, నిమజ్జనానికి బండి దొరక్కపోవడంతో ముగ్గురు స్నేహితులు ఒక పాత స్కూటర్‌ను టుక్ టుక్ బండిలాగా మారుస్తారు. అందులోనే వినాయకుడి ఊరేగింపు తీసి నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత నుంచి ఆ బండి దానంతట అదే ఆపరేట్ అవుతుంది. అది చూసి ఊరి జనాలు ఆ బండిలోకి దేవుడు వచ్చాడని అనుకుంటారు. ఆ టుక్ టుక్ కూడా జనాలు ఏది అడిగినా హ్యాండిల్ అటు ఇటు ఊపి సమాధానమిస్తూ ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఆ ముగ్గురు స్నేహితులు డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో వారికి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తోంది.
ఆ స్కూటర్లో ఉన్నది దేవుడు కాదు.. ఆత్మ అని ముగ్గురు టీనేజీ కుర్రాళ్లకు అర్థమవుతుంది. ఆ టుక్ టుక్ స్కూటర్ వారిని భయపెడుతుంది కూడా. మరి ఆ స్కూటర్లో ఉన్న ఆత్మ ఎవరిది? దానితో ఆ ముగ్గురు కుర్రాళ్లకు ఏమైనా సమస్యలు వచ్చాయా? దాన్ని వాళ్లు ఏం చేశారనేదే అసలు కథ.