నీకు నచ్చింది ప్రపంచానికి నచ్చాల్సిన పనిలేదు. ప్రపంచానికి నచ్చింది నీకు నచ్చాలని రూల్ లేదు. ఈ సోషల్ మీడియా యుగంలో అందరూ గ్రహించాల్సిన విషయం ఇది. సామాన్యుల పోస్టులకే కౌంటర్లు తప్పడంలేదు. ఇక సెలబ్రిటీల పోస్టుల విషయంలో ఎలా ఉంటుందో ఊహించుకోండి. అందుకే అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి కూడా భయపడుతుంటారు కొందరు సెలబ్రిటీలు. ఇటీవల త్రిష ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నది. మన్సుర్ అలీఖాన్ వివాదంతో సౌత్ ఇండస్ట్రీలో త్రిష ఓ చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఆ వివాదం పూర్తిగా సద్దుమణగలేదనే చెప్పాలి.
ఇంతలో మరో తలనొప్పిని తెచ్చిపెట్టుకుంది త్రిష. ఇటీవలే ఆమె ‘యానిమల్’ సినిమా చూసింది. ఆ సినిమా అమ్మడికి తెగ నచ్చేసినట్టుంది. ఆనందం ఆపుకోలేక ‘యానిమల్’ పోస్టర్ని తన ఇన్స్టాలో పోస్ట్ చేసి, ‘కల్ట్ మూవీ’ అంటూ రాసేసింది. అంతే.. ఇక ఆ సినిమా నచ్చని వాళ్లంతా త్రిషపై దండెత్తారు. ‘ఆడవాళ్లు.. హక్కులూ.. ఆత్మాభిమానాలూ అంటూ మాట్లాడతావ్.. ఇలా స్త్రీలను అవమానించేలా తీసిన సినిమాలను మాత్రం పొగిడేస్తుంటావ్.. నీ పద్ధతి ఏం నచ్చ లేదు.’ అంటూ విమర్శలు గుప్పించారు. దాంతో ఈ వ్యతిరేకతను తట్టుకోలేక తన ఇన్స్టా స్టోరీని తొలగించేసింది త్రిష.