త్రిష ప్రస్తుతం ‘థగ్ లైఫ్’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఆమె ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో వివాహం గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. వివాహబంధంపై మీ అభిప్రాయమేంటి? అనే ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. ‘జరుగుతున్న పరిణామాలు, చూస్తున్న నిదర్శనాలను బట్టి ప్రస్తుతానికైతే పెళ్లిపై నాకంత సదభిప్రాయం లేదు. నిజం చెప్పాలంటే మూడుముళ్ల బంధంపై నాకు నమ్మకం పోయింది. పెళ్లి చేసుకొని చాలామంది అసంతృప్తితో జీవిస్తున్నారు.
కొందరైతే విడాకులు తీసుకుంటున్నారు. అలాంటి పరిస్థితి నాకు రాకూడదని కోరుకుంటున్నా’ అన్నారు త్రిష. ఇంకా చెబుతూ ‘పెళ్లి ఎందుకు చేసుకోలేదు? అనడిగితే నాదగ్గర సమాధానం లేదు. ఎప్పుడు చేసుకుంటారు? అనంటే నాకు తెలియదు. అసలు నాకు పెళ్లి యోగం ఉందో లేదో తెలియదు. పెళ్లి జరిగినా ఓకే.. జరక్కపోయినా ఓకే. నాకైతే బాధ లేదు. మనిషి ఆశాజీవి కాబట్టి ఒక్కటి మాత్రం చెబుతా.. పెళ్లంటూ చేసుకుంటే నచ్చినవాడ్నే చేసుకుంటా. వాడు జీవితాంతం నాకు తోడుంటాడని నమ్మితేనే తాళికట్టించుకుంటా. ఇదిమాత్రం పక్కా’ అని చెప్పుకొచ్చారు త్రిష. ఈ సమాధానంతో పక్కనే ఉన్న కమల్‌హాసన్ సైతం షాకయ్యారు.