Toxic | కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం టాక్సిక్ విడుదలపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ చిత్ర బృందం అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. మొదట ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా జూన్ 4కు వాయిదా వేశారు. అనంతరం మళ్లీ రిలీజ్ డేట్ మారే అవకాశముందన్న ప్రచారం జోరందుకుంది. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ముందుగా ప్రకటించినట్టుగానే జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నామని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడానికి చిత్ర యూనిట్ భారీ ప్రణాళికలు రూపొందించింది.
యశ్‌తో పాటు నిర్మాత నమిత్ మల్హోత్రా అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక సినిమాకాన్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అక్కడ యశ్ తన రాబోయే ప్రాజెక్ట్స్ అయిన ‘రామాయణ’తో పాటు ‘టాక్సిక్’ గురించి గ్లోబల్ స్థాయిలో వివరించనున్నట్లు సమాచారం. ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందనను దక్కించుకుంది. గ్రాండియర్ విజువల్స్, స్టైలిష్ మేకింగ్‌తో ఈ సినిమా ఇంటర్నెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్న ఈ మూవీని తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో డబ్ చేయనున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించబోతుందని చిత్రబృందం చెబుతోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న టాక్సిక్ సినిమా రిలీజ్‌పై క్లారిటీ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.