Janhvi Kapoor | సినిమా పాత్రల ఎంపికలో తనకు కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పింది అగ్ర కథానాయిక జాన్వీకపూర్. ఎంత పెద్ద సినిమాలో అవకాశం వచ్చినా సరే జుట్టు లేకుండా కనిపించే పాత్రను అస్సలు అంగీకరించనని స్పష్టం చేసింది. ఈ భామ నటించిన తాజా చిత్రం ‘ఉలఝ్’ త్వరలో విడుదలకానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాత్రలపరంగా తాను విధించుకున్న పరిమితుల గురించి వివరించింది.
ఆమె మాట్లాడుతూ ‘ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. అయితే జుట్టు లేకుండా నటించడానికి అస్సలు ఇష్టపడను. ‘ఉలఝ్’ సినిమాలో పాత్రపరంగా కొంత జుట్టు కట్ చేసుకోవాలని దర్శకుడు కోరితే సున్నితంగా తిరస్కరించా. నా తొలి చిత్రం ‘ధడక్’లో జుట్టు కత్తిరించుకుంటే అమ్మ కోప్పడింది. ఎలాంటి పాత్ర చేసినా సరే, జుట్టు మాత్రం కట్ చేసుకోవద్దని సలహా ఇచ్చింది.
అమ్మకు నా జట్టు అంటే చాలా ఇష్టం. వారానికి రెండుసార్లు ఆయిల్ రాసి కేశ సంరక్షణ గురించి ఎన్నో విషయాలు చెప్పేది. అమ్మ మీద ఇష్టంతో హెయిర్ కట్ చేసుకోవద్దని నిర్ణయించుకున్నా.’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జాన్వీకపూర్ తెలుగులో ఎన్టీఆర్, రామ్చరణ్ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది.