అగ్ర కథానాయిక నయనతార భర్త, తమిళ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్‌శివన్ తాజా చిత్రం ‘ఎల్ఐసీ’ వివాదంలో చిక్కుకుంది. ‘లవ్‌టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి జంటగా విఘ్నేష్ శివన్ ‘ఎల్ఐసీ’ (లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) సినిమాను తెరకెక్కించబోతున్నారు. గత వారమే ఈ సినిమా ప్రకటన వెలువడింది. త్వరలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ సంస్థ పేరును సినిమా టైటిల్‌గా వాడుకోవద్దంటూ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ దర్శకుడు విఘ్నేష్ శివన్‌కు నోటీసులు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా తమ సంస్థకు ప్రజల్లో మంచి పేరుప్రఖ్యాతులు ఉన్నాయని, సినిమా కోసం ఈ టైటిల్‌ను ఉపయోగిస్త్తే తమ ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఎల్ఐసీ సంస్థ నోటీసుల్లో పేర్కొంది. వారం రోజుల్లో టైటిల్‌ను మార్చకపోతే న్యాయపరమైన చర్యలు సిద్ధమవుతామని ఎల్ఐసీ సంస్థ హెచ్చరించింది. ప్రస్తుతం ఈ వివాదం తమిళ సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. స్వీయ నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్ భాగస్వామ్యంలో సెవన్ స్క్రీన్ స్టూడియోతో కలిసి విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్నందిస్తున్నాడు.