ఎఫ్-క్లబ్ జనరల్ మేనేజర్ హాజరుకావాలని ఈడీ సమన్లు
ఈడీ దర్యాప్తులో కీలకంగా మారిన ఎఫ్-క్లబ్ ‘పార్టీ’లు..
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా సినీ హీరో నవదీప్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం ప్రశ్నించనున్నారు. ఇదే రోజు విచారణకు హాజరుకావాల్సిందిగా ఎఫ్-క్లబ్ జనరల్ మేనేజర్‌కు సైతం ఈడీ అధికారులు ఇప్పటికే సమన్లు జారీ చేశారు. తొలుత కేసు అంతా డ్రగ్ సరఫరాదారుడు కెల్విన్ చుట్టూ తిరిగినా, విచారణ క్రమంలో ఎఫ్-క్లబ్లో పార్టీలపైనా, ఆ పార్టీల్లో పాల్గొన్నవారి ఆర్థిక లావాదేవీలపైనా ఈడీ అధికారులు దృష్టి సారిస్తూ వచ్చారు. దీంతో సోమవారం నాటి విచారణకు హీరో నవదీప్, ఎఫ్-క్లబ్ మేనేజర్ హాజరుకానుండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో ఈడీ అధికారులు దర్శకుడు పూరీజగన్నాథ్, హీరోయిన్లు చార్మి, రకుల్‌ప్రీత్‌సింగ్, నటుడు నందు, హీరోలు దగ్గుబాటి రానా, రవితేజ, అతడి డ్రైవర్ శ్రీనివాస్‌లను గంటల తరబడి ప్రశ్నించిన విషయం తెలిసిందే. వీరందరి నుంచి కూడా ఈడీ అధికారులు వారివారి బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించారు. అదేవిధంగా కెల్విన్, అతడి స్నేహితుడు, ఈవెంట్ మేనేజర్ జీషాన్‌అలీల బ్యాంక్‌ఖాతాల్లోకి ఎవరెవరి నుంచి డబ్బుల మళ్లింపులు జరిగాయన్న అంశాలపై ఆరా తీసిన విషయం తెలిసిందే. సోమవారం నాటి విచారణలో నవదీప్, ఎఫ్-క్లబ్ జనరల్ మేనేజర్ చెప్పే అంశాల ఆధారంగా కేసులో ఇంకేమైనా కొత్త లింకులు బయటపడతయా..? ఇంకేవైనా కొత్త పేర్లు బయటికి వస్తాయా?..అన్నదానిపై టాలీవుడ్ వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చజరుగుతోంది.