Tommy Lee Jones | ‘మెన్ ఇన్ బ్లాక్’ (Men in Black) చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ విజేత టొమ్మీ లీ జోన్స్ ఇంట్లో విషాదం నెలకొంది. అతడి కుమార్తె నటి విక్టోరియా జోన్స్ (Victoria Jones) కొత్త ఏడాది రోజున అనుమానాస్పదంగా కన్నుమూశారు. జనవరి 1 తెల్లవారుజామున శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక లగ్జరీ హోటల్లో ఆమె మృతదేహం లభ్యమైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న సమయంలో జనవరి 1వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రసిద్ధ ఫెయిర్మాంట్ హోటల్ (Fairmont Hotel)లో విక్టోరియా అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని సిబ్బంది గుర్తించింది. దీంతో వెంటనే పోలీసులతో పాటు ఆసుపత్రికి పిలుపునిచ్చారు. అయితే హోటల్ నుంచి వచ్చిన అత్యవసర పిలుపుతో పారామెడిక్ సిబ్బంది అక్కడికి చేరుకుని విక్టోరియాను బతికించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతానికి విక్టోరియా మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. పోలీసులు దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ఇందులో ఎటువంటి కుట్ర లేదని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని అధికారులు వెల్లడించారు.
విక్టోరియా వయసు 34 ఏళ్లు. ఆమె టొమ్మీ లీ జోన్స్ మరియు ఆయన మాజీ భార్య కింబర్లీ క్లౌలీల కుమార్తె. తన తండ్రి నటించిన ‘మెన్ ఇన్ బ్లాక్ 2’ (2002) చిత్రంతో పాటు ‘వన్ ట్రీ హిల్’ వంటి టీవీ సిరీస్లలో కూడా విక్టోరియా నటించింది. ఈ హఠాన్మరణంతో టొమ్మీ లీ జోన్స్ అభిమానులు, హాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.