సినిమా కథాంశాల్లో పీరియాడిక్ జానర్ చాలా ప్రత్యేకమైనది. ప్రేక్షకుల్ని కాలం వెనక్కి తీసుకెళ్లి నాటి కథలను, సంఘటనలను వెండితెరపై కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. కాలగర్భంలో కలిసి పోయిన అనేక రహస్యాలను పట్టి చూపిస్తాయి. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో పీరియాడిక్చిత్రాలకు ఆదరణ పెరుగుతున్నది. ఇక తెలుగులో పదికిపైగా చిత్రాలు ఈ జానర్లో రూపుదిద్దుకుంటున్నాయి. అందులో కొన్ని పూర్తిగా చారిత్రక యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతుండగా, మరికొన్ని ఫిక్షనల్ కథాంశాలతో ముస్తాబవుతున్నాయి.
Periodic Movies | పీరియాడిక్ సినిమాల ట్రెండ్ తెలుగులో కొత్తేమీ కాదు. ఈ జానర్లో వచ్చిన ఆర్ఆర్ఆర్, శ్యామ్‌సింగరాయ్, సీతారామం, సలార్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాల్ని సొంతం చేసుకున్నాయి. వీటి స్ఫూర్తితో యువ దర్శకులు సైతం అలాంటి కథలతో ముందుకొస్తున్నారు. ఈ తరహా చిత్రాల్లో కథా నేపథ్యమే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్‌గా నిలుస్తున్నది. మేకింగ్, విజువల్స్ పరంగా కూడా కొత్తదనాన్ని చూపించే అవకాశం ఉండటంతో ఈ జానర్ చిత్రాలపై ప్రేక్షకులు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు.
మహేశ్‌బాబు-రాజమౌళి కాంబినేషన్ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి నుంచి రాబోతున్న సినిమా ఇదే కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ ఏర్పడింది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో సమకాలీన అంశాలతోపాటు 18వ శతాబ్దం నేపథ్యంలో కీలక ఘట్టాలను తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. దీనికోసం గిరిజన తెగల నాటి ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లపై దర్శకుడు రాజమౌళి విస్త్రృత పరిశోధన చేస్తున్నారని, వాళ్ల లుక్స్ ఎలా ఉండాలనే విషయమై స్కెచ్‌లు కూడా గీయించారని తెలుస్తున్నది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
అగ్ర హీరో ప్రభాస్ ఏకకాలంలో మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అందులో హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కూడా ఉంది. 1945 ప్రాంతపు స్వాతంత్య్ర సంగ్రామం నేపథ్యంలో నడిచే కథ ఇదని సమాచారం. ఇందులో ప్రభాస్ బ్రిటిష్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తున్నది. హిస్టారికల్ ఫిక్షన్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్వాతంత్య్రసిద్ధికి యుద్ధం ఒక్కటే పరిష్కారమని నమ్మే యోధుడిగా ప్రభాస్ పాత్ర అత్యంత శక్తిమంతంగా ఉంటుందని.. దేశభక్తి, ప్రేమ, త్యాగం, పోరాటం అంశాల కలబోతగా యూనివర్సల్ ఫీల్‌తో ఈ సినిమా ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు.
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 1854-1978 మధ్యకాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల నేపథ్య కథాంశమిది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారనే వార్తలొస్తున్నాయి. రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో కథ నడుస్తుందని, యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది.
యువ హీరో శర్వానంద్ తాజా సినిమా ప్రకటన ఇటీవలే వెలువడింది. సంపత్ నంది దర్శత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉత్తర తెలంగాణ నేపథ్య కథాంశంతో తెరకెక్కించనున్నారు. 1960 దశకంలో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని గ్రామీణ ప్రాంతంలో నడిచే కథ ఇది. ఈ సినిమా కోసం హీరో శర్వానంద్ సరికొత్త మేకోవర్‌తో సిద్ధమవుతున్నారు. భారీ యాక్షన్ అంశాలతో ఎమోషనల్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నామని దర్శకుడు సంపత్ నంది తెలిపారు.
వరుణ్‌తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘మట్కా’. కరుణకుమార్ దర్శకుడు. 80వ దశకంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విశాఖపట్నంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ కథను సిద్ధం చేసుకున్నారని, 1958-1982 మధ్య కథ నడుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో వరుణ్‌తేజ్ ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి ఆదరణ దక్కింది.
‘దసరా’ చిత్రం హీరో నానిలోని మాస్ కోణాన్ని ఆవిష్కరించింది. బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్లతో సంచలనం సృష్టించింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తొలి చిత్రంతోనే సత్తా చాటారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా కూడా ‘దసరా’ తరహాలోనే సింగరేణి నేపథ్య కథాంశమని ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం సికింద్రాబాద్‌లోని బస్తీ నేపథ్యంలో నడిచే కథని తెలుస్తున్నది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా బలమైన భావోద్వేగాలతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్క్రిప్ట్ సిద్ధం చేశారని అంటున్నారు.
ఈ సినిమాలతోపాటు మరికొన్ని భారీ ప్రాజెక్ట్‌లు సైతం పీరియాడిక్ కథాంశాలతో రూపొందుతున్నాయి. తమిళ అగ్ర హీరో సూర్య నటిస్తున్న ‘కంగువ’ చిత్రాన్ని కొన్ని వందల ఏళ్ల నాటి పీరియాడిక్ కథతో రూపొందిస్తున్నారు దర్శకుడు శివ. నవంబర్‌లో విడుదల కానుంది. ఓ రహస్య దీవి నేపథ్యంలో నడిచే ఈ కథలో సూర్య యుద్ధవీరుడి పాత్రను పోషిస్తున్నారు. నిఖిల్ ‘స్వయంభూ’ సినిమా కూడా పీరియాడిక్ కథనే. చారిత్రక, దైవిక అంశాల కలబోతగా తెరకెక్కిస్తున్నారు. యువ హీరో కిరణ్ అబ్బవరం ‘క’ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. 1970వ దశకంలో నడిచే థ్రిల్లర్ ఇది. వీటితోపాటు అనేక చిన్న చిత్రాలు కూడా పీరియాడిక్ కథలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రజెంట్ ట్రెండ్‌లో పీరియాడిక్ కథలకు లభిస్తున్న ఆదరణ దృష్ట్యా హీరోలతోపాటు దర్శకనిర్మాతలు కూడా ఈ తరహా కథలపై మక్కువ చూపిస్తున్నారు.
– సినిమా డెస్క్