Cinema News | వెండితెరపై తారాడే అందమైన అనుభూతుల వర్ణ చిత్రంలా గత ఏడాది కాలయవనికపై నుంచి మెల్లగా జారిపోయింది. నిరుడు తెలుగు సినిమాకు బాగా కలిసొచ్చింది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై టాలీవుడ్ కీర్తిపతాక రెపరెపలాడింది. ఈ నేపథ్యంలో ద్విగుణీకృతమైన ఉత్సాహంతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టింది. మరికొద్ది రోజుల్లో సంక్రాంతి సంరంభానికి తెరలేవనుంది. ఈ సందర్భంగా నయా సాల్‌కు స్వాగతం పలుకుతూ అభిమానుల్లో జోష్‌ను నింపుతూ భారీ చిత్రాల తాజా అప్డేట్స్ వెలువడ్డాయి. కొత్త పోస్టర్స్ కళకళలాడాయి. వాటి విశేషాలేమిటో ఓసారి చూద్దాం..
‘దేవర’..8న గ్లింప్స్
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఇప్పటికే 80శాతం చిత్రీకరణ పూర్తయింది. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్నది. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. తొలి భాగం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ కొత్త లుక్‌ను విడుదల చేశారు. ఇందులో బోటుపై నిల్చొని ఉగ్రరూపంలో కనిపిస్తున్నారాయన. ఈ సినిమా గ్లింప్స్‌ను ఈ నెల 8న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
‘సైంధవ్’..ట్రైలర్ సిద్ధం
అగ్ర హీరో వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకుడు. సంక్రాంతి కానుకగా ఈ నెల 13న విడుదలకానుంది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ ప్రధానంగా యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రైలర్‌ను ఈ నెల 3న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో వెంకటేష్, బేబీ సారా చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించారు.
యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది. న్యూ ఇయర్‌ను పురస్కరించుకొని కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రవితేజ ైస్టెలిష్‌గా కనిపిస్తున్నారు. ప్రేక్షకులకు ఆద్యంతం థ్రిల్‌ను కలిగించే కథాంశమిదని, రవితేజ పాత్ర నవ్యరీతిలో సాగుతుందని చిత్ర బృందం తెలిపింది. అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, కమిల్ ప్లాకి, కర్మ్ చావ్లా, సంగీతం: డేవ్ జాంద్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, ఎడిటింగ్, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని.
గీతాంజలి మళ్లీ వస్తున్నది..
అంజలి కథానాయికగా నటిస్తున్న 50వ చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది..’. హారర్ కామెడీ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. మలయాళ నటుడు రాహుల్ మాధవ్ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు. ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్ ఇది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సోమవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో పాడుబడ్డ భవంతిలో నాట్య కళాకారిణి లుక్‌లో అంజలి కనిపిస్తున్నది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి నిర్మాతలు: ఎంవీవీ సత్యనారాయణ, జీవీ, దర్శకత్వం: శివ తుర్లపాటి.
పోలీస్ పవర్ ‘భీమా’
గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భీమా’. ఏ.హర్ష దర్శకత్వంలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలు. సోమవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో హీరో గోపీచంద్ ఖాకీ దుస్తుల్లో ఫెరోసియస్గా కనిపిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నాం. పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా గోపీచంద్ పాత్ర మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: స్వామి జె గౌడ, సంగీతం: రవి బస్రూర్, సంభాషణలు: అజ్జు మహంకాళి, దర్శకత్వం: ఏ. హర్ష.