సినిమా అంటే.. హీరో! ఆ కథానాయకుడికి ఫస్టాఫ్ అంతా కష్టాలే రావాలి! సెకండాఫ్‌లో వాటన్నిటినీ అతగాడు జయించాలి. తురుంఖాన్ అనిపించుకోవాలి. అదే సినిమా సక్సెస్ ఫార్ములా అని అందరూ భావిస్తారు. హీరోయిజం థియేటర్ బయటి కటౌట్ కన్నా భారీగా ఉంటేనే అభిమానులకు పండుగ! అదే హీరో పరిస్థితులకు తలొగ్గితే, విధి వలయంలో చిక్కుకుంటే, విఫలుడై మిగిలిపోతే.. ఫ్యాన్స్ ఉస్సూరుమంటారు! బాక్సాఫీస్ బేరుమంటుంది! వెరసి సినిమా అట్టర్ ఫ్లాప్ అన్న అపకీర్తి మూటగట్టుకుంటుంది. కానీ, కొన్ని సినిమాలు ఈ ఫార్ములాలో ఇమడవు. హీరో ఫెయిల్ అయినా.. సక్సెస్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ఇవి..
ఫెయిల్యూర్ స్టోరీ అనగానే విషాదాంతం అనుకుంటాం! ముగింపును ప్రేక్షకుడు జీర్ణించుకోలేకపోయినా.. ఎందుకో ఆ సినిమాకు కనెక్ట్ అవుతాడు. ఫెయిల్యూర్ స్టోరీకి నిర్వచనం ప్రత్యేకంగా ఏదీ లేదు! హీరో తన లక్ష్యాన్ని అందుకోలేకపోవడమే ఫెయిల్యూర్ కథ కమామిషు అని కొందరి అభిప్రాయం. ఈ క్రమంలో హీరో పాత్రతో త్యాగం చేయించి సెంటిమెంట్ పండించిన దర్శకులు ఎందరో! ‘అంతులేని కథ’, ‘ఇది కథ కాదు’ తరహా బాలచందర్ చిత్రాలు కూడా ఫెయిల్యూర్ సినిమా కోవలోకే వస్తాయి. ముగింపులేని కథల జాబితాలోనూ అవి చోటు దక్కించుకున్నాయి. అక్కినేని ‘ప్రేమాభిషేకం’ నుంచి నిన్నమొన్న వచ్చిన ‘సీతారామం’ వరకు విఫల ప్రేమను బాక్సాఫీస్ దగ్గర సఫలం చేసిన కథలెన్నో!
అసలు సిసలు ఫెయిల్యూర్ స్టోరీతో వెండితెరపై కాసులు కురిపించిన చిత్రరాజం దేవదాసు. బెంగాలీ బాబు శరత్చంద్ర రాసిన ‘దేవదాసు’ విఫల గాథ. ఈ నవల ఆధారంగా వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో 1953లో విడుదలైన అక్కినేని ‘దేవదాసు’ అపురూప చిత్రంగా నీరాజనాలు అందుకుంది. లైలామజ్ను, సలీం- అనార్కలీ జీవితాలు విఫల ప్రేమకు తార్కాణాలు! కానీ, ఈ చారిత్రక జంటల సరసన నిలిచిన నవలా పాత్రలు దేవదాసు-పార్వతి. సినిమాగా రూపుదిద్దుకోక ముందే.. దేవదాసు భగ్న ప్రేమికుడని ప్రపంచానికి తెలుసు.
పారూను అమితంగా ప్రేమించిన దేవదా పెద్దల పెత్తనానికి తలొగ్గి తన ఉద్దేశాన్ని మార్చుకుంటాడు. రాత్రికి రాత్రి వచ్చి తనను పెండ్లి చేసుకోమని పార్వతి బతిమాలినా.. అసాధ్యం అనేస్తాడు! అక్కడితోనే ఆగలేదు దేవదాసు వైఫల్యం. ప్రేమించిన పడతిని మర్చిపోలేక.. తాగుడుకు బానిసవుతాడు. ద్వితీయార్ధం అంతా తూలుతూనే ఉంటాడు. చివరికి విఫల ప్రేమికుడిగా.. తనువు చాలిస్తాడు! అయి తేనేం, దేవదాసు సక్సెస్ అయ్యాడు. ఎన్ని భాషల్లో, ఎన్నిసార్లు వచ్చినా నిర్మాతకు కాసులపంట పండించాడు. ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తూనే… సూపర్ హిట్ అయ్యాడు. ‘బాధే సౌఖ్యమనే భావన’ కల్పించి భగ్న ప్రేమికుల పాలిట దేవుడయ్యాడు ఈ దేవదాసు!
బాలచందర్ ఎంతో ఇదిగా తీసి, తర్వాత ఎందుకిలా తీశానా అని వగచిన సినిమా ‘మరోచరిత్ర’. 1978లో వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం. కమల్‌హాసన్, సరిత.. బాలు, స్వప్నగా నటించారు. వీరి ప్రభావం ఎంత ఉందంటే.. ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాల్లో హీరోహీరోయిన్ల పేర్ల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా పోయింది! అయితే, చూసే దాకా ‘మరోచరిత్ర’ విషాదాంతం అని ఎవరికీ తెలియదు. ైక్లెమాక్స్లోనే కాదు.. కథాగమనంలోనూ కొన్ని ఫెయిల్యూర్స్ చోటు చేసుకుంటాయి. చిక్కగా ప్రేమించుకున్న జంట.. చక్కగా కలిసిపోకుండా పెద్దలు అడ్డుపడతారు! ఇది సినిమాల్లో చాలా కామన్! పందెం కాసి ప్రేయసికి దూరమైన ప్రియుడు చాలాకాలం కుదురుగానే ఉంటాడు. ఓ బలహీన క్షణంలో పట్టుతప్పేదాకా వెళ్తాడు.
మళ్లీ పట్టాలెక్కుతాడు. కాలపరిమితి ముగిశాక.. తన స్వప్నను కలుసుకోవడానికి ఆగమేఘాల మీద వస్తాడు. కానీ, ‘విధి చేయు వింతలన్ని మతిలేని చేత లేనని..’ అని ఆత్రేయ అన్నట్టు.. ఆ విధి వలయంలో ఇద్దరూ విఫలురుగా మిగిలిపోతారు. బలవన్మరణానికి పాల్పడతారు. విషాదాంతంగా ముగిసిన ఈ ఫెయిల్యూర్ స్టోరీ… బాక్సాఫీస్ దగ్గర బిగ్ సక్సెస్ సాధించింది. అంతేకాదు, తరాలు మారినా.. ఇప్పటికీ ‘మరోచరిత్ర’ గొప్ప చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ సినిమా విడుదలయ్యాక కొన్నాళ్లపాటు చెన్నై మెరీనా బీచ్‌లో వారానికి ఒకటిరెండు ప్రేమ జంటలు ఆత్మహత్యకు పాల్పడ్డాయట. ఆ వార్తలు విని బాలచందర్.. బాలు, స్వప్నను బతికించి ఉంటే, ఈ వార్తలు వచ్చేవి కావేమో అనుకున్నారట.
కళాతపస్వి కె.విశ్వనాథ్, కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన అద్భుత చిత్రం ‘సాగర సంగమం’. ఈ సినిమా ఫస్ట్ షాట్‌లోనే ఓ తాగుబోతు, అరిగిన చెప్పులను జేబులో దోపుకొన్న వాడు.. అలా వస్తుంటాడు. విధికి తలొగ్గి వేదనగా మిగిలిన ఓ ఫెయిల్యూర్ పర్సన్ స్టోరీ ఇది అని దర్శకుడు విశ్వనాథ్ మొదటి సీన్లోనే చూపించేశాడు. కానీ, ఆ విఫల కళాకారుడు, ప్రేమికుడు అయిన బాలు కథను రెండున్నర గంటలపాటు ప్రేక్షకులు కన్నార్పకుండా చూశారు. అతగాడు ‘వేవేల గోపెమ్మలా..’ అని మనసు చంపుకొని నృత్యం కంపోజ్ చేస్తుంటే మనమూ బాధపడ్డాం. ‘భంగిమ’ అంటూ ట్రైనీ ఫొటోగ్రాఫర్ అతణ్ని ఆటపట్టిస్తే నవ్వుకున్నాం.
మరపురాని రేయిలో ‘మౌనమేలనోయి.. ’ అని కథానాయికను వినమ్రంగా అనునయిస్తుంటే కరిగిపోయాం. తాను ఆరాధించిన వ్యక్తిని, ఆమెను కట్టుకున్న వాడి చేతిలో పెట్టినప్పుడు పొంగిపోయాం. కానీ, ఆ తర్వాత అతని జీవితమే మారిపోతుందని ఎవరూ ఊహించరు. మళ్లీ ఇరవై ఏండ్లకు ఇదిగో కళాకారుడు బాలు తాగుబోతు బాలుగా కనిపిస్తాడు! నూతి మీద తకిట తధిమి అని గంతులేస్తుంటే.. మనమే ఆ నుయ్యిలో పడిపోతామా అన్నంత భయపడ్డాం!! తన లక్ష్యాన్ని మరచిన నృత్య కళాకారుడు.. ఓ శిష్యురాలి ఛీత్కారాలను భరించిన వైనం కంటతడి పెట్టిస్తుంది. చివరికి తనకంటూ ఏదీ లేకుండా నటరాజ పాదాల చెంత తలవాల్చిన బాలును చూసి భారంగా నిట్టూర్పు విడుస్తాం. ఇంతకన్నా గొప్ప ఫెయిల్యూర్ స్టోరీ మరొకటి ఉండదేమో! అలాంటి కథతో ఇంతటి హిట్ సాధించిన సినిమా కూడా ఇదేనేమో!
అవకాశం వచ్చినప్పుడల్లా ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో హీరో నాని ముందుంటాడు. అలా ఆయన చేసిన సినిమానే ‘జెర్సీ’. కొడుక్కు రూ.500తో ఓ జెర్సీ కొనివ్వలేని తండ్రి కథ ఇది. భార్య ఇచ్చే డబ్బులపై బతుకు వెళ్లదీసే ఓ భర్త కథ ఇది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇందులో క్రికెటర్ అవ్వాలన్న హీరో కోరిక నెరవేరదు. పైగా అనుకోని పరిస్థితుల్లో ఆటకు దూరమవుతాడు. చేస్తున్న ఉద్యోగం ఊడిపోతుంది. వీటికి తోడు స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్! ఇన్ని వైఫల్యాలు మూటగట్టుకున్న హీరో.. ఓసారి బ్యాటు పట్టుకుంటాడు.
ఆ మ్యాచ్‌లో అతను రాణిస్తే… ఇండియా జట్టుకు ఎంపిక కావడం ఖాయం. అద్భుతంగా రాణిస్తాడు. కానీ, ఆ గెలుపు పిలుపు చెవిన పడకముందే.. తనువు చాలిస్తాడు. పైకి ఫెయిల్యూర్‌గా కనిపించిన జెర్సీ హీరో పాత్ర అర్జున్ (నాని) ఎంత సక్సెస్ సాధించాడో మరో ఇరవై ఏండ్లకు ప్రపంచానికి తెలుస్తుంది. ఇంగ్లండ్ టూర్‌కు సెలెక్ట్ చేసిన ఇండియా జట్టులో అర్జున్ పేరుందని లోకానికి తెలుస్తుంది. ఓ విఫల ఆటగాడి ఆటోబయోగ్రఫీ ఎందుకు రాయాల్సి వచ్చిందో.. ఆ ైక్లెమాక్స్ చూస్తే గానీ అర్థం కాదు! మొత్తానికి ఫెయిల్యూర్ కథతో రూపుదిద్దుకున్న ‘జెర్సీ’ సూపర్‌హిట్ టాక్ అందుకుంది.