అదృష్టం కలిసి రావడం లేదని పేరు మార్చుకునే వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉంటారు. కానీ చిరంజీవికి ఇప్పుడు పేరు మార్చుకోవాల్సిన అవసరం ఏముంటుంది? కనీసం ఈ చిన్న లాజిక్ అర్థం చేసుకోకుండా.. సోషల్ మీడియాలో గత 24 గంటలుగా చిరంజీవి పేరు మార్చుకున్నారు అంటూ నానా రాద్ధాంతం చేస్తున్నారు. దీనిపై గాడ్ ఫాదర్ చిత్ర యూనిట్ కూడా స్పందించింది.
40 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే 150 సినిమాలు పైగా నటించారు. ఇన్నేళ్లలో ఆయన చూడని విజయాలు లేవు.. సృష్టించని రికార్డులు లేవు.. అందుకోని అవార్డులు లేవు.. ఇంత సాధించిన తర్వాత ఇంకేం సాధించాలని ఆయన పేరు మార్చుకుంటారు..? న్యూమరాలజీని నమ్ముకొని ఇప్పటికిప్పుడు పేరు మార్చుకొని చిరంజీవి ఏం సాధించాలి అని అడుగుతున్నారు విశ్లేషకులు.
గాడ్ ఫాదర్ టీజర్ లో EE కి బదులు అదనంగా మరో E పడటం కేవలం పొరపాటు మాత్రమే అని తెలిపారు చిత్ర యూనిట్.
అంతేకానీ సోషల్ మీడియాలో వస్తున్నట్టు చిరంజీవి పేరు మార్చుకున్నాడు అనడంలో ఎలాంటి నిజం లేదని.. ఆ పొరపాటు వెంటనే సరిదిద్దుకున్నామని చెబుతున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న గాడ్ ఫాదర్ దసరాకు విడుదల కానుంది. కేవలం ఒక పాట చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. దాన్ని కూడా జులై 7 నుంచి షూట్ చేస్తున్నారు. మరోవైపు తలకోనలో జరగబోయే చిన్న షెడ్యూల్లో చిరంజీవి కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఏదేమైనా కూడా పేరు మార్చుకున్నాడు అంటూ చిరంజీవిపై వచ్చిన ప్రచారం మాత్రం హాస్యాస్పదంగా ఉంది అంటున్నారు అభిమానులు. అనుకోకుండా జరిగిన చిన్న పొరపాటును సోషల్ మీడియాలో ఇంత వైరల్ చేయడం అనవసరం అంటూ విశ్లేషకులు కూడా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.