Tollywood | టాలీవుడ్ స్థాయి పెరిగింది. వైవిధ్యమైన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. డిఫరెంట్ కంటెంట్‌ని ప్రేక్షకులు ఆదరిస్తున్న నేపథ్యంలో మేకర్స్ కూడా కొత్త దనాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దేవుళ్లపై టాలీవుడ్లో చాలా సినిమాలు రూపొందాయి. ముఖ్యంగా శివుడికి సంబంధించిన చిత్రాలు ఎన్నో తెరకెక్కడమే కాకుండా మంచి విజయాలు సాధించాయి. అయితే ట్రెండ్‌కి తగ్గట్టుగా శివయ్యపై సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే తమన్నా నటించిన ఓదెల2 చిత్రం శివయ్య ప్రధానంగా రూపొందిన చిత్రమే. అలానే `శివం భజే శివుడు కీలకంగా రూపొందింది. ఈ రెండు ఈ మధ్య కాలంలో రిలీజ్ అయి మంచి ఫలితాలు సాధించాయి.
తాజాగా పాన్ ఇండియాలో శివ నామస్మరణ మోగించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న కన్నప్ప ప్రాజెక్ట్ మంచు ఫ్యామిలీకే డ్రీమ్ ప్రాజెక్ట్ కాగా, ఇది శివుని భక్తుడు కన్నప్ప కథ ఆధారంగా తెరకెక్కింది. గత కొద్ది రోజులుగా ఈ మూవీ తెగ వార్తలలో నిలుస్తుంది. అందుకు కారణం ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, మధు ప్రీతి ముకుందన్ లాంటి స్టార్లు కీలక పాత్రలు పోషించడమే. జూన్‌లో ఈ మూవీ విడుదలకి సిద్ధం కాగా, దీనిపై అందరిలో భారీ అంచనాలే ఉన్నాయి. సీజీ పనులు ఆలస్యమవుతోన్న నేపథ్యంలో చిత్ర రిలీజ్ కాస్త వాయిదా వేసి జూన్ 27న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
నందమూరి నటసింహ బాలకృష్ణ నటిస్తోన్న అఖండ2 చిత్రం కూడా శివుని నేపథ్యంలో రూపొందుతుంతుంది. బాలయ్య ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలయ్య అఘోరిపాత్రలో విశ్వరూపం చూపించబోతున్నారు. ప్రత్యేకంగా కుంభమేళా కూడా కలిసి రావడంతో, అక్కడ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా ఉంటాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తుంది. అఘోరి పాత్రలో బాలయ్య నట విశ్వరూపం చూపించడం ఖాయం. మరోవైపు సుధీర్ బాబు హీరోగా నటించిన జఠాధర కూడా శివుడి కాన్సెప్ట్ ని ఆధారంగానే రూపొందింది. సాయి శ్రీనివాస్ నటిస్తోన్న `హైంధవ, అరవింద్ కృష్ణ నటిస్తోన్న ఎ మాస్టర్ పీస్ శివుడి కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.