September | టాలీవుడ్ బాక్సాఫీస్‌కి ఆగస్టు నెల పెద్దగా ఉపయోగపడలేదు. జూలై నెలతో పోల్చితే ఆగస్ట్‌లో థియేటర్లకు వచ్చి సందడి చేసిన సినిమాలు తక్కువే. గడిచిన 31 రోజుల్లో 14 స్ట్రెయిట్ తెలుగు సినిమాలు మరియు 3 డబ్బింగ్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. కానీ వీటిలో బాక్సాఫీస్‌ను ఊపేసిన సినిమా ఒక్కటీ కనిపించలేదు. హిట్ రేట్ గణనీయంగా పడిపోయింది. జూలై నెలతో పోల్చితే రిలీజ్‌ల సంఖ్య తగ్గడమే కాక, మంచి వసూళ్లు అందుకున్న సినిమాలు అరుదుగా కనిపించాయి. జూలై చివరి వారంలో విడుదలైన విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ ఆగస్టు మొదటివారంలో సూపర్ స్టార్ట్ ఇచ్చింది. ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నెలకు బాక్సాఫీస్ కి బూస్టప్ ఇచ్చినా, తర్వాత వచ్చిన సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి.
మహావతార్ నరసింహ కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. ఆగస్టు మొదటి వారంలో ‘థ్యాంక్యూ డియర్’, ‘బకాసుర రెస్టారెంట్’, ‘రాజుగాని సవాల్’, ‘భళారే సిత్రం’ వంటి పలు చిన్న చిత్రాలు రిలీజైనప్పటికీ, వాటిని ప్రేక్షకులు పట్టించుకోలేదు. సరైన ప్రమోషన్ లేకపోవడం, కథలో సత్తా లేకపోవడం వల్ల ఈ సినిమాలు వచ్చి వెళ్లిన విషయం కూడా చాలా మందికి తెలియదు. ఇక ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా విడుదలైన ‘వార్ 2 భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ సినిమా హిందీలో మంచి స్పందన పొందినా, తెలుగులో మాత్రం పూర్తిగా నిరాశ పరిచింది. హైదరాబాద్‌లో కూడా హిందీ వెర్షన్‌కే ఎక్కువ ఆదరణ లభించింది.
‘వార్ 2’తో పాటు విడుదలైన మరో డబ్బింగ్ మూవీ కూలీ ఓపెనింగ్స్ బాగానే రాబట్టిన ఆ తర్వాత జోరు తగ్గింది. భారీ తారాగణం ఉన్నప్పటికీ, సినిమా చివరికి రూ.500 కోట్లు వసూలు చేసి ఆగిపోయింది. తెలుగులో మాత్రం ఈ చిత్రం రూ.80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అందులో రూ.64 కోట్లు తెలుగు రాష్ట్రాల నుంచి , రూ.16 కోట్లు నార్త్ అమెరికా నుంచి వచ్చినట్లు సమాచారం. ఇక ఆగస్టు 22న విడుదలైన అనుపమ పరమేశ్వరన్ పరదా మరియు ఆర్. నారాయణ మూర్తి యూనివర్సిటీ సినిమాలు కంటెంట్ పరంగా మంచి టాక్ తెచ్చుకున్నా వసూళ్ల పరంగా ఆకట్టుకోలేకపోయాయి. అదే రోజు వచ్చిన మేఘాలు చెప్పిన ప్రేమకథ’, ‘స్ప్రూహా వంటి చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించలేకపోయాయి.
ఇక నారా రోహిత్ నటించిన ‘సుందరకాండకి మంచి రివ్యూలు వచ్చిన కలెక్షన్లలో దెబ్బ తిన్నది. అదే వారం విడుదలైన దుల్కర్ సల్మాన్ నిర్మించిన డబ్బింగ్ మూవీ ‘కొత్త లోక’ మాత్రం తెలుగు ఆడియన్స్ నుంచి మంచి స్పందన పొందింది. ‘అర్జున్ చక్రవర్తి’, ‘త్రిబాణధారి బార్బారిక్’, ‘కన్యాకుమారి’ వంటి సినిమాలు ట్రైలర్లతో ఆకట్టుకున్నా, థియేటర్లలో మాత్రం నిరాశపరిచాయి. ఆగస్టు నెల పూర్తిగా నిరాశపర్చడంతో, సెప్టెంబర్ నెల పైనే ట్రేడ్ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. దసరా ఫెస్టివల్ సీజన్ కూడా రావడంతో పెద్ద సినిమాల విడుదలకు అవకాశం ఉంది. ఈ నెల పవన్ కళ్యాణ్ ‘ఓజీ’, మిరాయ్, ఘాటి, కాంత వంటి క్రేజీ చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. ఈ సినిమాలే కాకుండా మరిన్ని మల్టీ లాంగ్వేజ్ చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ను కుదిపేసే అవకాశముంది.