ఎవరేమనుకున్నా.. కథానాయకులే సినిమాలకు కళా కాంతి. హీరోలు ఎన్ని సినిమాలు చేస్తే.. సినీ పరిశ్రమ అంత కళకళలాడుతుంది. ఇసుమంత కూడా దీన్ని కాదనలేం. ఒకప్పుడు ఒక్కో హీరో ఏడాదికి అరడజనుకు పైనే సినిమాలు చేసేవాళ్లు. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. క్వాలిటీ మోజు.. పానిండియా క్రేజు పెరిగిపోయి.. బడ్జెట్ అమాంతం కొండెక్కి కూర్చుంది. దాంతో ఒక్కో సినిమా తీయడానికే ఏడాది పడుతున్నది. ఈ కారణంగా కొందరు స్టార్ల సినిమాలు ఒక్కో ఏడాదిలో విడుదలే కావడంలేదు. 2024లో అసలు సినిమాలే లేని హీరోలు అయిదారుగురున్నారు. అయితే.. 2025 మాత్రం పరిస్థితి అలాలేదు. స్టార్ హీరోల సినిమాలతో రెండు తెలుగు రాష్ర్టాల్లోని థియేటర్లన్నీ కళకళలాడబోతున్నాయి. ఈ ఏడాది ఇద్దరు హీరోలు మినహా.. దాదాపు అందరు హీరోల సినిమాలు విడుదల కానుండటం విశేషం. ఆ సంగతేంటో తెలుసుకుందా పదండి..
గత ఏడాది చిరంజీవి నటించిన ఒక్క సినిమా కూడా లేదు. ఈ ఏడాది ఆయన ‘విశ్వంభర’తో రానున్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 9న విడుదల కానున్నట్లు తెలుస్తున్నది. అలాగే.. అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల కథలకు కూడా మెగాస్టార్ పచ్చజెండా ఊపేశారు. ఈ ఏడాదంతా ఆ సినిమాల పనిలో బిజీగా ఉంటారాయన.
Tollywood | ఇక హ్యాట్రిక్ స్టార్ నందమూరి బాలకృష్ణకు గత ఏడాదంతా ఎన్నికల హడావిడే సరిపోయింది. అందుకే ఒక్క సినిమా కూడా ఆయనది రిలీజ్ కాలేదు. అయితే.. ఈ ఏడాది ప్రథమంలోనే ‘డాకు మహారాజ్’గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారాయన. మరోవైపు ‘అఖండ’ సీక్వెల్ ‘అఖండ – తాండవం’ షూటింగ్ కూడా జరుగుతున్నది. ఈ ఏడాది దసరాకల్లా ఆ సినిమాను తెచ్చేందుకు దర్శకుడు బోయపాటి కసరత్తులు చేస్తున్నారు.
గత ఏడాది విడుదలైన నాగార్జున ఏకైక సినిమా ‘నా సామిరంగ’. ఈ ఏడాది మాత్రం ఆయనవి రెండు సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో ఒకటి ‘కుబేరా’. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక, రెండో సినిమా రజనీకాంత్ ‘కూలీ’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున విలన్‌గా నటిస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఈ రెండూ కూడా కోలీవుడ్‌కి చెందిన పానిండియా సినిమాలే కావడం గమనార్హం.
గత ఏడాది ‘సైంధవ్’గా ఉద్వేగపూరితంగా కనిపించిన వెంకీ.. ఈ ఏడాది మాత్రం సంక్రాంతి శోభనంతా తనలోనే నింపుకొని ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి.
ఇక గత ఏడాది ఒక్క సినిమా కూడా చేయని మరో హీరో పవన్‌కల్యాణ్. ఆయన కూడా పాలిటిక్స్‌లో బిజీగా ఉండటం వల్లే సినిమాలు చేయలేదు. ఈ ఏడాది ఏకంగా ఆయన నుంచి రెండు సినిమాలు రానున్నాయి. ఒకటిలో ఒకటి సుజిత్ ‘ఓజీ’ కాగా, రెండోది ‘హరిహర వీరమల్లు’. రెండూ పానిండియా ప్రాజెక్టులే కావడం విశేషం. వీటిలో ‘హరిహర వీరమల్లు’ మార్చి 28న విడుదల కానుంది.
గత ఏడాది ‘దేవర’గా బాక్సాఫీస్ దగ్గర సందడి చేసి, 600కోట్లు కొల్లగొట్టిన ఎన్టీఆర్.. ఈ ఏడాది ‘వార్ 2’తో పానిండియా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. హృతిక్ రోషన్‌తో కలిసి తారక్ నటిస్తున్న ఈ బాలీవుడ్ పానిండియా యాక్షన్ థ్రిల్లర్‌కు ఆయాన్ ముఖర్జీ దర్శకుడు. తారక్ వన్ ఆఫ్‌ది హీరో కావడంతో రెండు తెలుగు రాష్ర్టాల్లో భారీ ఎత్తునే ఈ సినిమా విడుదలవ్వడం సహజం. ఈ ఏడాది ఆగస్ట్ 14న సినిమా విడుదల కానుంది. వచ్చే నెల నుంచి ప్రశాంత్‌నీల్ సినిమా షూటింగ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు తారక్.
ఇక గత ఏడాది ‘కల్కి 2898ఏడీ’తో ఏకంగా 13కోట్ల వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్‌ని షేక్ చేసిన పానిండియా సూపర్‌స్టార్ ప్రభాస్.. ఈ ఏడాది ‘ది రాజా సాబ్’గా రానున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ కామెడీ హారర్ పానిండియా థ్రిల్లర్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల చేయనున్నట్టు సమాచారం. ఇక ఈ ఏడాది అంతా సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్’ షూటింగ్లో ప్రభాస్ బిజీగా ఉంటారు.
రామ్‌చరణ్ నటించిన ఒక్క సినిమా కూడా గత ఏడాది విడుదల కాలేదు. ఈ ఏడాది అందరికంటే ముందు ‘గేమ్‌ఛేంజర్’గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారాయన. సంక్రాంతి కానుకగా ఈ నెల 10న సినిమా విడుదలకానున్న విషయం తెలిసిందే. మరోవైపు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతున్నది. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివర్లో ఈ సినిమా రావొచ్చు.
ఇక భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ ‘మాస్ జాతర’, శైలేష్ కొలను దర్శకత్వంలో నాని ‘హిట్ 3’, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ‘వీడీ 12’(వర్కింగ్ టైటిల్), రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ సినిమా, హీరో నితిన్ రాబిన్‌హుడ్, తమ్ముడు సినిమాలు, నిఖిల్ ‘శ్వయంభూ’, విశ్వక్సేన్ ‘లైలా’, సిద్ధు జొన్నలగడ్డ జాక్, తెలుసుకదా సినిమాలు, అడివి శేష్ గూఢచారి2, డెకాయిట్.. ఇవన్నీ ఈ ఏడాదే విడుదల కానున్నాయి.
ఆ విధంగా దాదాపుగా హీరోలందరి సినిమాలూ ఈ ఏడాది సందడి చేయనున్నాయన్నమాట. అయితే.. ఈ ఏడాది కూడా సినిమాలు విడుదల కాని హీరోలు ఇద్దరున్నారు. వారిలో ఒకరు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. గత ఏడాది ‘గుంటూరు కారం’తో బాక్సాఫీస్‌కు ఘాటెక్కించిన మహేష్.. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ గురువారం లాంఛనంగా మొదలైంది. వేసవిలో షూటింగ్ అంటున్నారు. వెయ్యికోట్ల బడ్జెట్‌తో రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ సినిమా కాబట్టి.. వచ్చే ఏడాది కూడా ఈ సినిమా రిలీజ్ డౌటే. ఇక రెండో హీరో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. గత ఏడాది చివర్లో ‘పుష్ప-2’గా వచ్చి నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేశాడు బన్నీ. ప్రస్తుతం ‘బాహుబలి’ రికార్డు వైపు ‘పుష్ప2’ దూసుకుపోతున్నది. తన నెక్ట్స్ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఉంటుందని గతంలోనే బన్నీ ప్రకటించారు. ఈ ఏడాది మధ్యలో షూటింగ్ స్టార్ట్ చేసి, 2026 చివర్లో విడుదల చేస్తామని చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ఆ విధంగా.. ఈ ఏడాది మహేశ్, బన్నీ మినహా.. మిగతా హీరోలంతా వెండితెరపై సందడి చేయనున్నారన్నమాట.
దీన్నిబట్టి చివరిగా చెప్పొచ్చేదేంటంటే… ఈ ఏడాది ప్రేక్షకులకు కన్నులపంట.. బాక్సాఫీస్‌కు కాసులపంట..